దేవళాలకు పెళ్లి కళ!
ఆ మూడు దేవాలయాల్లో సోమవారం పెళ్లి కళ తొణికిసలాడింది! కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమారారామభీమేశ్వర స్వామి, పిఠాపురంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి, కోనసీమ జిల్లాలోని పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివార్ల కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లి పెద్దలుగా అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల నడుమ కల్యాణాలు వైభవోపేతంగా సాగాయి.
పిఠాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట నిత్య కల్యాణాలతో విరాజిల్లే ఆది దేవుడి వార్షిక కల్యాణం అంటే భక్తులకు కనుల పండువ. ఆది దేవుని కల్యాణానికి ముత్తయిదువలు పసుపు వాయ వేయగా భక్తులంతా పెళ్లి పెద్దలుగా తరలిరాగా ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురం పెళ్లి కళతో కళకళలాడింది. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా స్వామి అమ్మవార్లను తీసుకుని సారె చీరలతో వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలతో భక్త జనం తరలివచ్చారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవాలు, మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకుక్కుటేశ్వరస్వామి కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్త జనసందోహం నడుమ శ్రీకుక్కుటేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్ల పరిణయం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో పసుపు కొట్టి స్వామి అమ్మ వార్లను పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ వాసవి కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజవాహనంపై గ్రామోత్సవం అనంతరం ఆలయ అర్చకుల ఆద్వర్యంలో పెండ్లికుమారుడైన కుక్కుటేశ్వరస్వామిని, పెండ్లి కుమార్తెగా రాజరాజేశ్వరి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు, నగలతో అర్చకులు అలంకరించారు. స్వామివారిని, అమ్మవారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రంగు రంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపచేశారు. వేద పండితులు ద్విబాష్యం సుబ్రహ్మణ్యశర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో అర్చకులు చెరుకుపల్లి వెంకటేశ్వశర్మ, అల్లంరాజు చంద్రమౌళి, వింజమూరి సుబ్రహ్మణ్యం యాజ్ఞీకంలో వేదమంత్రాల నడుమ విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. రాత్రి 8.32 గంటలకు స్వామివారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. వివాహ సమయంలో పుణ్యాహవచనం, కంకణ ధారణ, సుముహూర్తం, కన్యాదానం, యజ్ఞోపవీతధారణ, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణల మధ్య కుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవం రమణీయంగా నిర్వహించారు. ఈవో జగన్మోహన్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కమనీయం కుక్కుటేశ్వరుని కల్యాణం
భక్తులతో కిక్కిరిసిన పాదగయక్షేత్రం
మారుమోగిన శివనామస్మరణ
దేవళాలకు పెళ్లి కళ!
Comments
Please login to add a commentAdd a comment