
నేనేమి చేశాను నేరం..!
సాక్షి, అమలాపురం: మనలో ఉంటారు. కాని ప్రపంచం తెలియదు. మనతో కలిసి జీవిస్తారు. కాని జీవనం అంటే ఏమిటో తెలియదు. మన మాటలు వింటారు కానీ, తిరిగి పూర్తిగా సమాధానం చెప్పలేరు. కనీసం తమకు ఏదైనా శారీర ఇబ్బంది తలెత్తినా.. బాధతో విలవిల్లాడుతున్నా భరించడమే కానీ నోరు తెరిచి చెప్పలేని దుస్థితి వారిది. శారీరక దివ్యాంగానికి, మానసిక దివ్యాంగత్వం కూడా తోడు కావడంతో చిన్నారులు, యువతీ యువకులు మంచాలకే పరిమితమవుతున్నారు. ఇటువంటి వారికి మంచాలపై ఉంటున్న దీర్ఘకాలిక రోగులకు ఇస్తున్నట్టుగా రూ.15 వేల పింఛను ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు పలు అవాంతరాలూ ఏర్పడుతున్నాయి. మంచాలపై ఉన్న దీర్ఘకాలిక రోగులకు మాత్రమే రూ.15 వేల పింఛనుకు జీవో ఉంది. ఇలా శారీరక, మానసిక దివ్యాంగులు మంచాలకే పరిమితవుతున్నా, వీరికి మాత్రం కేవలం రూ.6 వేల పింఛను మాత్రమే లభిస్తోంది. పైగా సదరన్ సర్టిఫికెట్‌లో ఇలా రెండు రకాల దివ్యాంగత్వంతో ఇబ్బంది పడుతూ మంచానికే పరిమితమవుతున్నారనే ఆప్షన్ లేకపోవడం వీరికి ప్రధాన అవరోధంగా పరిణమించింది. మొత్తం 21 రకాల దివ్యాంగులున్నారు. కానీ సదరం వైబ్‌సైట్‌లో కేవలం ఐదు రకాల దివ్యాంగులనే చూపుతోంది. కోనసీమ జిల్లాలో ఇటువంటి వారు సుమారు 500 మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో కొందరికి దివ్యాంగ పింఛను రూ.6 వేలు వస్తుండగా, మరికొంత మందికి అదీ లేదు.
ఉన్నంత లోనే సరిపుచ్చుతూ..
ప్రతి నెలా రూ.వేలల్లో అవుతున్న వైద్యం.. తల్లిదండ్రులు సామాన్య కూలీలు. కౌలుదారులు కావడం వల్ల లక్షలాది రూపాయలు పోసి తమ పిల్లలకు మెరుగైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఉన్నదానిలో కొంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించడం, నెల వారీ మందులు కొనడంతో సరిపుచ్చుతున్నారు. ప్రభుత్వం మంచానికి పరిమితమై, వైద్యం పొందుతున్న వారికి ఇస్తున్నట్టుగా తమ వారికి కూడా నెలకు రూ.15 వేల పింఛను ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా మొరపెట్టుకుంటున్నారు. వీరంలో కొంతమంది కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు. తమ గోడును జాయింట్ కలెక్టర్ టి.నిషాంతికి మొరపెట్టుకున్నారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు.
అక్షరం తప్పు ఉందని..
ఈ అబ్బాయి పేరు గంధం బాబి. వయస్సు 15 ఏళ్లు. రావులపాలెం మండలం దేవరపల్లి. తండ్రి లేడు. తల్లి గంధం కాసులమ్మ కూలీ పనిచేసి పెంచాల్సిందే. ఈ అబ్బాయిని కాసులమ్మ తల్లి అయిన వృద్ధురాలు సాకుతోంది. ప్రస్తుతం రూ.ఆరు వేల పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు దానికీ ఇబ్బంది వచ్చి పడింది. సదరన్ సర్టిఫికెట్‌లో బీవోబీబీవై అని, ఆధార్‌లో మాత్రం బీవోబీవై అని ఉందని పింఛను ఆపేలా ఉన్నారని తల్లి కాసులమ్మ తల్లడిల్లుతోంది.
తల్లి గర్భం నుంచి భూమిపై అవతరించిన శిశువుకు ఈ ప్రపంచమంటే ఏమిటో తెలియదు. తల్లి ఒడే ఆ పాపాయికి సర్వస్వం. ఆనందంగా ఉంటే కేరింతలు కొట్టడం.. ఆకలేస్తే ఏడుపు అందుకోవడం.. ఇదే తెలుసు. కాలక్రమంలో వయస్సును బట్టి తెలివితేటలు.. అవసరాన్ని బట్టి ప్రాపంచిక జ్ఞానం అలవడుతాయి. పెరిగి పెద్దవారై.. కుటుంబానికి చేదోడువాదోడై.. జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారు. కానీ.. ఏ నేరానికి వీరు ఈ శిక్ష అనుభవిస్తున్నారో చెప్పడానికి కూడా వీల్లేకుండా.. పుట్టుకతో మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నారు ఈ అభాగ్యులు. వయసు పెరుగుతున్నా.. సమాజంలో అందరిలా బతకలేక బతుకీడుస్తూ.. జీవితాన్ని చిదిమేస్తున్న కష్టాన్నీ గ్రహించలేక.. చెరగని చిద్విలాసాన్ని మోముపై చిందిస్తూ.. కనికరం లేని పాలకుల కరకు హృదయాలు వారి ఉనికిని అణచివేస్తున్నా.. కనీసం వేలెత్తి చూపలేని ఈ శారీరక, మానసిక దివ్యాంగుల అమాయకత్వంపై ఈ ప్రభుత్వం కరుణించడం లేదు.
ఈమె పేరు మద్దింశెట్టి హారిక.
వయస్సు 22 ఏళ్లు. ఆమెది రావులపాలెం మండలం గోపాలపురం. శారీరక, మానసిక వైకల్యం వల్ల ఇంటిలో మంచానికే పరిమితమైంది. ఇప్పుడు దివ్యాంగులకు ఇచ్చే రూ.6 వేల పింఛను మాత్రమే అందుతోంది. తండ్రి వ్యవసాయ కూలీ. వైద్యం పేరుతో ఆపరేషన్లు చేసినా, ఇప్పుడు మందులు వాడుతున్నా పింఛను సొమ్ము లేదా
తండ్రి కూలీగా వచ్చే సొమ్ముతోనే.
ఈ అబ్బాయి పేరు పితాని సిద్ధివిలాస్. రావులపాలెం మల్లయ్యదొడ్డి గ్రామం. వయస్సు 15 ఏళ్లు. తల్లి వెంటక లక్ష్మీ ఆలనాపాలనా చూస్తుంటే, తండ్రి శ్రీనివాస్ కూలీ పని చేస్తూ పోషిస్తున్నాడు. సిద్ధి విలాస్‌కు మాటలు రావు. అడుగు తీసి అడుగు వేయలేడు.
కాలకృత్యాలు, ఇతర అవసరాలకు తల్లిదండ్రులు చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి చేయించాల్సిందే.
పుట్టినప్పటి నుంచి మంచానికే..
గాడ సాత్విక్ కుమార్ వయస్సు ఏడు సంవత్సరాలు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గాడ రాజు, ఎస్తేరురాణి దంపతుల కుమారుడు. పుట్టినప్పటి నుంచీ మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. రూ.6 వేల పింఛను మాత్రమే వస్తోంది.
మంచానికే జీవితం పరిమితం
పింఛను పెంచమన్నా..
ప్రభుత్వం చూపని కనికరం
శారీరక దివ్యాంగత్వంతో
పాటు మానసికంగానూ ఇక్కట్లు
సదరన్‌లో లేని బహుళ దివ్యాంగత్వ ఆప్షన్
అందని రూ.15 వేల పెన్షన్
కుదేలవుతున్న కుటుంబాలెన్నో..
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ..
ఆదిమూలం నాగ సత్యవతికి 15 ఏళ్లు. ఆదిమూలం సత్యనారాయణమ్మకు 14 ఏళ్లు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తెలు. వీరిద్దరూ పుట్టుక నుంచే మంచానికి పరిమితమైన మానసిక దివ్యాంగులు. తండ్రి సత్యనారాయణ కౌలుదారుడు. అలాగే జీవనం కూలీ పని కూడా చేసి సాగిస్తున్నారు.
వెబ్‌సైట్ ఓపెన్ కాలేదట..!
కొత్తపేట పాత రామాలయం వీధికి చెందిన చోడపనీడి లక్ష్మణుడు వయస్సు ఆరేళ్లు. శివ నాగప్రసాద్, రాజేశ్వరి దంపతుల కుమారుడు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు(కవలలు). వీరిద్దరిలో రెండో కుమారుడు లక్ష్మణుడు. ఈ బాలుడు మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. కుమార్తె కూడా దివ్యాంగురాలే. వీరిద్దరికీ ఇంత వరకు ఎటువంటి పింఛనూ పొందలేకపోతున్నారు. దరఖాస్తు చేద్దామని వెళుతుంటూ సిబ్బంది వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారని ప్రసాద్ దంపతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!

నేనేమి చేశాను నేరం..!
Comments
Please login to add a commentAdd a comment