
విజ్ఞానాసక్తి ఉంటే భవిష్యత్తు శాస్త్రవేత్తలు మీరే..
ముమ్మిడివరం: విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై, విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించిన క్విజ్ మాస్టర్ పీవీ బ్రహ్మానందం, మేక రామలక్ష్మి, టీఆర్‌ఎస్ పద్మావతిని అభినందించారు. క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనాతవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సర్ ఐజాక్ న్యూటన్, ఆర్యభట్ట వేషధారణ ఆకట్టుకుంది. జిల్లా విజ్ఞాన శాస్త్ర అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమగ్ర శిక్షా ఏఎంఓ రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా ఉత్తమ పరిశోధకులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సమగ్ర శిక్షా ఎఫ్‌ఏఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులను నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గౌరీశంకర్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డీఈఓ షేక్ సలీం బాషా
విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు
Comments
Please login to add a commentAdd a comment