చివరాఖరికి కదలిక
● రత్నగిరిపై కలెక్టర్ తనిఖీతో
అధికారుల్లో చలనం
● దేవస్థానం ర్యాంకు తగ్గడంపై అసంతృప్తి
● వివిధ విభాగాలను పరిశీలించిన ఈఓ
అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ దేవస్థానం అధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రత్నగిరికి చివరి ర్యాంకు రావడంతో, దేవస్థానంలో మార్పు తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన దేవస్థానంలోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేశారు. భక్తులతో నేరుగా మాట్లాడారు. వసతి గదుల విభాగంలో అవకతవకలు ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేవస్థానంలో తీసుకునే ప్రతి కీలక నిర్ణయాన్ని కలెక్టర్ పరిశీలించనున్నారు. దేవస్థానంలో ఆయా విభాగాల అధికారులపై వేటుకూ వెనుకాడని పరిస్థితులు నెలకొనడంతో ఆయా వర్గాల్లో కదలిక మొదలైంది. కాగా దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులతో కలసి అన్నదాన విభాగం, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన గదులు, పాత మెయిన్ గెస్ట్‌హౌస్ వెనుక టాయిలెట్స్‌ను మంగళవారం పరిశీలించారు. మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈఓ వెంట ఈఈ రామకృష్ణ, ఇతర అధికారులున్నారు.
బఫే పద్ధతిలో భోజనాలు
అన్నదానం విభాగంలో భక్తులకు భోజనాలు ఆలశ్యమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించిన విషయం విదితమే. దీనిపై అన్నదానం హాలు మొదటి అంతస్తులో కొందరు భక్తులకు బఫే పద్ధతిలో భోజనాలు పెడతామని అధికారులు తెలిపారు. దీనిపై ఈఓ సుబ్బారావు అన్నదాన విభాగాన్ని పరిశీలించారు. ఆహార పదార్థాల తరలింపు కోసం లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులు వెళ్లేందుకు మెట్లు కూడా నిర్మించాలి.
వచ్చే నెలలో మరోసారి తనిఖీ..!
జిల్లా కలెక్టర్ వచ్చే నెలలో కూడా దేవస్థానంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసారీ ఆకస్మిక తనిఖీలు చేస్తారని దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు గాడిన పడే వరకు ప్రతి నెలా దేవస్థానానికి వస్తానని కలెక్టర్ చెప్పిన విషయం విదితమే. సోమవారం కలెక్టర్ పర్యటన ముందుగా నిర్ణయించినది కావడంతో దేవస్థానం అధికారులు జాగ్రత్త పడ్డారనే ప్రచారం సాగుతోంది. ఇలాఉండగా ఈ నెలాఖరు నుంచి వచ్చే నెలాఖరు వరకు సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించనుంది. దాని ఆధారంగా మరలా ర్యాంకులు కేటాయిస్తారు. తొలి మూడు ర్యాంకుల్లో అన్నవరం దేవస్థానం ఉండేలా సేవలు మెరుగుపడాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment