పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి...?
రాష్ట్ర బడ్జెట్‌పై ఎస్టీయూ అసంతృప్తి
అమలాపురం టౌన్: గతం నుంచి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీ ఇప్పటికే కొన్ని నెలలపాటు జాప్యం జరిగినప్పటికీ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దాని అమలుకు నిధుల కేటాయింపుపై స్పష్టత లేదని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతంశెట్టి దొరబాబు, సరిదే సత్య పల్లంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్, జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేనందుకు నిరుత్సాహంగా ఉందన్నారు. అలాగే పాఠశాల విద్యకు గత సంవత్సరం 10.15 శాతం నిధులు కేటాయించగా ప్రస్తుతం 9.86 శాతం మాత్రమే నిధులు ఇచ్చారన్నారు. విద్యా రంగాన్ని మెడల్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినట్లుగా బడ్జెట్‌లో ఆ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని దొరబాబు, సత్య పల్లంరాజు స్పష్టం చేశారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపర్చిన గోదామును అధికారులతో కలసి పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాము సీళ్లను తనిఖీ చేసి రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల గోదాములను తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపిస్తామని డీఆర్వో తెలిపారు. ఎలక్షన్ డీటీ శివరాజ్, ముమ్మిడివరం డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సైన్స్ సంబరాలు
రాయవరం: సర్ సీవీ రామన్ జయంతిని ఆయా పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవంగా శుక్రవారం జరుపుకొన్నారు. జిల్లాలోని 1,582 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ప్రారంభించారు. ఆన్‌లైన్ క్విజ్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 3న జిల్లా స్థాయి ఆఫ్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఆలయ అభివృద్ధికి రూ.2 లక్షలు
ఆలమూరు: చింతలూరులో నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఓ దాత రూ.2 లక్షల విరాళం అందజేశారు. గుమ్మిలేరుకు చెందిన శ్రీకృష్ణతేజ సంస్థల అఽధినేత వంక సత్యనారాయణ (అన్నవరం) తన వ్యాపార భాగస్వామ్యులతో కలిసి శుక్రవారం ఆలయానికి విచ్చేశారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరికి అందజేశారు. శ్రీకృష్ణ ప్రభాస్ పేపరుమిల్లు యాజమాన్య ప్రతినిధులు వైట్ల దుర్గారావు, వల్లూరి వెంకట్రావు, వంక ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి...?
పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి...?
Comments
Please login to add a commentAdd a comment