ఇంటర్ పరీక్షలకు కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
అమలాపురం టౌన్: జిల్లాలో శనివారం నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అమలాపురంలోని కలెక్టరేట్, డీఐఈఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్‌కుయార్ ఆదేశాల మేరకు కలెక్టరేట్, డీఐఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరీక్షలపరంగా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు డీఐఈఓ సోమశేఖరరావు అమలాపురంలో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జుల ఫోన్ నంబర్లు 89190 91012, 83096 53112, డీఐఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరు 95503 35191ను సద్వినియోగం చేసుకోవాలని అన్నాశారు. ఈ రెండు చోట్ల నలుగురు ప్రతినిధులు విధులు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 40 పరీక్ష కేంద్రాల పనితీరును ఈ కంట్రోల్ రూమ్‌ల నుంచి సీసీ కెమెరాలతో అనుసంధానమైన కంప్యూటర్ తెరలపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు.
పరీక్ష కేంద్రం పరిశీలన
జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ సోమశేఖరరావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సిబ్బందికి ఆయన పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రం పేరు, ఫోన్ నంబరును కేంద్రం బయట ఒక బ్యానర్ రూపంలో ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో త్వరగా జీర్ణమయ్యే మంచి ఆహార పదార్థాలను భుజించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు సకాలంలో పంపించే ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment