ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ప్రకృతి సాగు ఉత్పత్తులకు జిల్లాలోని రైతు బజార్లలో ప్రత్యేక దుకాణాలను కేటాయించి, ఆ అమ్మకాలను ప్రోత్సహిద్దామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రానున్న ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి వ్యవసాయ, హార్టికల్చర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల స్టాల్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో 2024 –25 ఆర్థిక సంవత్సరంలో 92 గ్రామాల్లో 22,399 మంది రైతులు 22,586 ఎకరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఈ వ్యవసాయంతో భూమి కలుషితం కాకుండా ఉంటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడవచ్చన్నారు. ఏటీఎం మోడల్ ద్వారా 20 సెంట్ల భూమిలో 15 నుంచి 20 రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర ప్రసాద్, రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ, వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. మిగిలిన వారికి తరువాత రోజున అందించాలన్నారు. జేసీ టి.నిషాంతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment