
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కిర్లంపూడి: ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన సుంకు నూకరాజు (47) అదే గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. స్థానిక పరిసర గ్రామాల్లో తన ట్రక్ ఆటోలో వాటర్ బాటిల్స్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి యర్రవరంలో వాటర్ బాటిల్ వేసి తిరిగి వస్తుండగా సోమవరం జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి వైజాగ్ వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న నూకరాజు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మృతుడీకి భార్య, పెళ్‌లైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు కుమార్తె టిక్కా సంగీత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
డ్రైవర్ దుర్మరణం
పి.గన్నవరం: స్థానిక కొత్త అక్విడెక్టుపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మామిడికుదురు మండలం ఈ దరాడకు చెందిన డ్రైవర్ ఇంజరపు దుర్గావెంకట నాగరామకృష్ణ (39) రాజమహేంద్రవరం నుంచి ఇంటికి ఆటోపై వస్తుండగా, మలికిపురం నుంచి ఆలమూరుకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై బి.శివకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తేనెటీగల దాడి
సామర్లకోట: స్థానిక సీబీఎం సెంటర్‌లో తేనెటీగల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సీబీఎం సెంటర్‌లో కేబుల్ వైరు పనులు, చిరు వ్యాపారులు పనులు చేసుకొంటున్న సమయంలో ఆకతాయిలు చెట్టుపై ఉన్న తేనె పుట్టను కొట్టడంతో ఒకసారిగా తేనెటీగలు చెలరేగిపోయాయి. ఆ రోడ్డుపై ఉన్న వారిపై దాడి చేశాయి. దాంతో ప్రయాణికులతో పాటు చిరు వ్యాపారస్తులు, కేబుల్ టెక్నీషియన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment