
వనామీ.. ధర ఇదేమి!
సాక్షి, అమలాపురం: జాతీయ వనామీ రొయ్యల మార్కెట్ షేర్ మార్కెట్‌ను తలపిస్తోంది. షేర్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అంచనా వేయలేమన్నట్టుగా వనామీ రొయ్యల ధరలను సైతం ఇటు ఆక్వా రైతులు, అటు వ్యాపారులు అంచనా వేయలేకపోతున్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా ఎగుమతులు ఆశాజనంగా ఉన్నా.. మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల స్థానికంగా చికెన్ స్థానంలో రొయ్యల వినియోగం పెరిగినా మార్కెట్‌లో వనామీ ధర తగ్గుతుండటం శోచనీయం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈ సాగు ఉండగా, కోనసీమ జిల్లాలో 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 23 వేల ఎకరాల్లో సాగవుతోంది. కాకినాడ జిల్లాలో తొండంగి, తుని రూరల్, యు.కొత్తపల్లి, తాళ్లరేవు, కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో అధికంగా సాగవుతోంది. ప్రస్తుతం మూడొంతుల మంది రైతులు తొలి పంట సాగు చేస్తుండగా, మిగిలిన ఒక వంతు రైతులు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో పిల్లలు వదిలారు. ఇప్పుడు ఆ పంట చేతికి వస్తుంది. ఇటీవల కాలంలో ఆక్వా ధరలు ఆశాజనకంగా పెరిగాయి. దీంతో రైతులు పూర్తి స్థాయిలో సాగు ఆరంభించారు.
స్వల్పంగా తగ్గిన ధరలు
వనామీ రొయ్యల ధరలు గత ఫిబ్రవరి మొదటి వారానికి ఆశాజనకంగా పెరిగాయి. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తుండడంతో పెద్ద కౌంట్ అయిన 30 కౌంట్ (కిలోకి 30 రొయ్యలు), 40 కౌంట్‌కు డిమాండ్ వచ్చింది. దీంతో రైతుల్లో హుషారు నెలకొంది. కానీ ఈ సమయంలో పట్టుబడులు జరిగి మార్కెట్‌కు వచ్చిన రొయ్యలు చాలా తక్కువ. మార్చి మొదటి వారం నుంచి పట్టుబడులు మొదలు కానున్నాయి. ఈ సమయంలో ధరలు స్వల్పంగా తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
కొనుగోళ్లు తగ్గించేసి..
వనామీ రొయ్యలకు మార్కెట్‌లో కిలోకు రూ.5 నుంచి రూ.25 వరకూ తగ్గింది. ఇదే సమయంలో పెద్ద కౌంట్ రొయ్యలను కొనుగోలు చేయడం స్థానిక వ్యాపారులు తగ్గించేశారు. 30 కౌంట్ కొంత వరకూ కొనుగోలు చేస్తున్నా 40 కౌంట్ నుంచి 50 కౌంట్ మధ్య కొనుగోలు మరీ మందకొడిగా సాగుతోంది. ఈ రకం కొనుగోలుకు వ్యాపారులు కనీసం వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. పైగా మార్కెట్‌లో కిలోకి రూ.25 వరకూ కోత పెడుతున్నారు. నవంబర్‌లో సాగు మొదలు పెట్టిన రొయ్యల చెరువుల్లో ఈ కౌంట్ అధికంగా వస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో 7 వేల ఎకరాలకు పైబడి చెరువుల్లో ఈ రకం కౌంట్ వస్తోందని రైతులు చెబుతున్నారు. యూరప్ మార్కెట్ నుంచి వచ్చే కంటైనర్లలో 40 నుంచి 50 కౌంట్ రొయ్యలకు వచ్చే ఆర్డర్లు పదో వంతు తగ్గిపోయాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి మార్కెట్‌కు ఏ రకం కౌంట్ అధికంగా వస్తుందో చూసి అదే రకం కొనుగోలుకు కొర్రిలు వేస్తున్నారని అంటున్నారు. వీటికి ధరలు కూడా తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వినియోగం పెరిగినా..
కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిన తరువాత చికెన్ వినియోగం దాదాపు తగ్గింది. మేక మాంసం, చేపలు, రొయ్యల వినియోగం పెరిగింది. స్థానికంగా హెచ్చు ధరతో పెద్ద కౌంట్ రొయ్యల కొనుగోలు ఉండదు. వంద కౌంట్ అధికంగా వినియోగిస్తారు. ఇప్పుడు ఈ కౌంట్ ధరను సైతం కొనుగోలుదారులు తగ్గించడం విశేషం. 100 కౌంట్‌కు ఏకంగా రూ.15 వరకు తగ్గించేశారు. జనవరి తరువాత రొయ్య పిల్లలు వదిలిన చెరువుల నుంచి 100 కౌంట్ అధికంగా వస్తోంది. ఇలా మార్కెట్‌కు వచ్చే రొయ్యల ధరలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ నిలకడగా లేదు
వనామీ రొయ్యల ధరలు నిలకడగా ఉండడం లేదు. ఎప్పుడు పెరుగుతు న్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియడం లేదు. పట్టుబడులు సమయంలో ధరలు తగ్గిపోతున్నాయి. అందుకే మంచి కౌంట్ వచ్చినా మాకు నష్టాలే మిగులుతున్నాయి.
– చెదళ్ల పాపారావు, ఆక్వా రైతు,
సామంతకుర్రు, అల్లవరం మండలం
ప్రభుత్వ నియంత్రణ ఉండాలి
వనామీ రొయ్యల ధరలను ప్రైవేట్ కొనుగోలుదారులతో పాటు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్‌లపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉంటోంది కాబట్టి ధరలను నిర్ణయించే అవకాశం ఉంటోంది. అప్పుడే మార్కెట్‌లో నిలకడగా ధర ఉంటోంది.
– కొక్కిలిగడ్డ లోకేష్,
గాడిమొగ, తాళ్లరేవు మండలం
ఐ.పోలవరం మండలం మురమళ్లలో వనామీ రొయ్యల చెరువులు
మందకొడిగా పెద్ద కౌంట్ కొనుగోళ్లు
50 నుంచి 100 కౌంట్‌కు డిమాండ్
30 నుంచి 40 కౌంట్‌కు పెద్దగా
లేని ఆర్డర్లు
మార్కెట్ రేటు కన్నా రూ.10 నుంచి రూ.20 తగ్గించి కొనుగోలు
నష్టపోతున్న వనామీ రైతులు
రొయ్యల ధరలు ఇలా..
కౌంట్ రకం ఫిబ్రవరి ప్రస్తుతం
మొదటి ధర
వారంలో
30 కౌంట్ 470 465
40 కౌంట్ 415 390
50 కౌంట్ 375 365
60 కౌంట్ 345 335
70 కౌంట్ 320 300
80 కౌంట్ 285 270
90 కౌంట్ 265 250
100 కౌంట్ 255 240

వనామీ.. ధర ఇదేమి!

వనామీ.. ధర ఇదేమి!

వనామీ.. ధర ఇదేమి!
Comments
Please login to add a commentAdd a comment