టైప్‌ రైటింగ్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

టైప్‌ రైటింగ్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు

Published Wed, Mar 5 2025 12:05 AM | Last Updated on Wed, Mar 5 2025 12:04 AM

టైప్‌

టైప్‌ రైటింగ్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు

యానాం: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ నిర్వహించిన టైప్‌రైటింగ్‌ (ఇంగ్లిషు లోయర్‌)లో యానాం కొత్తపేటకు చెందిన యువతి మహదేవ నవ్యలక్ష్మి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఇటీవలి నిర్వహించిన పరీక్షకు ఆమె స్ధానిక రామలింగేశ్వర టైప్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి హాజరయిందని, ప్రథమ, ద్వితీయ పేపర్లకు 98 మార్కులు చొప్పున వచ్చాయని ప్రిన్సిపాల్‌ నాలం రుద్రరాజు తెలిపారు. ఏపీ టైప్‌రైటింగ్‌ అండ్‌ షార్ట్‌హ్యాండ్‌ ఇనిస్టిట్యూట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ఇ.శ్రీరాములు, ఏజీకే మూర్తి మెమెంటో, సర్టిఫికెట్‌ను మంగళవారం నవ్యలక్ష్మికి అందజేశారు. ఆమెను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అభినందించారు.

ఆన్‌లైన్‌లో ‘పది’

పరీక్షల హాల్‌ టికెట్లు

రాయవరం: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు అందజేసే పనిలో ఉన్నారు. విద్యార్థులు నేరుగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 95523 00009 నంబరుకు హాయ్‌ అని టైప్‌ చేసి వివరాలు నమోదు చేస్తే వాట్సాప్‌ ద్వారా హాల్‌ టికెట్‌ పొందే అవకాశాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించింది. మన మిత్ర యాప్‌ ద్వారా నేరుగా హాల్‌ టికెట్‌ పొందే అవకాశముంది. హాల్‌ టికెట్‌లో తప్పులు ఉంటే సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకంతో మెయిల్‌ చేసి పరిష్కరించుకునే వీలుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పది పబ్లిక్‌ పరీక్షలకు జిల్లా నుంచి 19,217 మంది పరీక్షలు రాయనున్నారు.

వేసవిలో విద్యుత్‌

సమస్యలపై దృష్టి

ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌

అమలాపురం రూరల్‌: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్‌ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్ల ఓవర్‌ లోడ్‌ను గుర్తించి అందుకు తగిన యాక్షన్‌ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా ప్యానల్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్‌ విద్యుత్‌ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్‌ కార్యాలయం వద్ద లైన్‌మెన్‌ దివస్‌ కార్యక్రమంలో లైన్‌మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.రాజబాబు, టెక్నికల్‌ డీఈ ఎస్‌.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్‌ ఆఫీసర్‌ సత్యకిషోర్‌, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

సీతారామపురంలో

శిలాఫలకం ధ్వంసం

తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానిక చినబొడ్డువెంకటాయపాలెం గ్రామ రహదారి నుంచి కాలభైరవస్వామి ఆలయానికి వెళ్లేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సుమారు రూ.20 లక్షలు వెచ్చించి సీసీ రహదారిని నిర్మించారు. దీనికి సంబంధించిన శిలఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమార్‌, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లాడి శ్రీను కోరంగి ఎస్సై పి.సత్యనారాయణకు తెలియజేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలిస్తే బాధ్యులను గుర్తించవచ్చని ఎస్సైకి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలని గోవిందకుమార్‌ కోరారు.

గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో

ధ్వంసమైన శిలాఫలకం

No comments yet. Be the first to comment!
Add a comment
టైప్‌ రైటింగ్‌లో  రాష్ట్ర ప్రథమ ర్యాంకు  1
1/1

టైప్‌ రైటింగ్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement