
ఇసుక.. మరింత కొరత
సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఇసుక ర్యాంపులోనే కాకుండా గోదావరి నదీపాయల పొడవునా అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నా... జిల్లాలో కృత్రిమ ఇసుక కొరత పట్టి పీడిస్తూనే ఉంది. ఇసుక అందుబాటులో లేదని... అడ్డుగోలుగా దోచుకుంటున్న సమయంలో జిల్లా ప్రధాన ఇసుక ర్యాంపులు మంగళవారం నుంచి మూతపడుతున్నాయి. ఇదే అదనుగా కొతర పేరుతో ఇసుక అక్రమార్కులు మరింత దోపిడీకి సిద్ధమవుతున్నారు.
కోనసీమ జిల్లాలో మొత్తం 15 ఇసుక ర్యాంపులున్నాయి. ఇదే సమయంలో అనధికార ర్యాంపులున్నాయి. కొత్తపేట, మండపేట నియోజకవర్గాలలో మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన ర్యాంపులున్నాయి. వీటిలో తొలుత 13 ర్యాంపులకు వేలం నిర్వహించారు. వీటిలో ఏడు ర్యాంపులకు మంగళవారంతో గడువు ముగిసింది. మిగిలిన ఆరు ర్యాంపులకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుంది. మిగిలిన రెండు ర్యాంపులు అయిన ఒకటి అంకంపాలెం, పొడగట్లపల్లి–3కు నవంబర్ 20వ తేదీ వరకు అనుమతి ఉంది.
మొత్తం ఏడు ర్యాంపులకు సంబంధించి మార్చి 4వ తేదీ సాయంత్రానికి 3,87,450 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి మంజూరు చేసింది. మైన్స్ అధికారుల లెక్కల ప్రకారం 1,73,863 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేశారు. ఇంకా 2,13,587 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. అనుమతి మేరకు మిగిలిన పరిణామం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు జిల్లా మైన్స్ ఏడీ వంశీధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ ఏడు ర్యాంపుల వద్ద ఉన్న స్టాక్ పాయింట్‌లలో సుమారు 1,07,976 మెట్రిక్ టన్నుల ఇసుక అమ్మకాలకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
తొలుత టెండర్లు నిర్వహించిన సమయంలో అతి తక్కువకు బిడ్ వేసి వద్దిపర్రు–1, పొడగట్లపల్లి–2, వద్దిపర్రు–2 మూడు ర్యాంపులను దక్కించుకున్న సాన్వీ, మిట్టల్, కోస్టల్ కాంట్రాక్ట్ కంపెనీలను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి సాండ్ కమిటీ అనర్హులుగా ప్రకటించింది. రెండో స్థానంలో ఆర్‌ఎస్‌ఆర్ (కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి స్నేహితుని కంపెనీ)కి ఈ మూడు ర్యాంపులను కట్టబెట్టారు. ఇందుకు జిల్లా సాండ్ కమిటీ చెప్పిన కారణం... తక్కువకు టెండరు వేసిన వారు పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలు చేయలేరని. కాని వాస్తవంగా ఇప్పుడు టెండరు దక్కించుకున్న ఏడు ర్యాంపులలో సహితం పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలు జరగలేదు. వాస్తవంగా ఆయా ర్యాంపుల నుంచి అధికంగా ఇసుక తవ్వకాలు జరిగింది పులిదిండి, పొడగట్లపల్లి–1, నార్కెడ్‌మిల్లిలో మాత్రమే. మిగిలిచోట్ల పెద్దగా ఇసుక తవ్వకాలు చేయలేదు. మరీ ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఆర్ అడ్డదారిలో దక్కించుకున్న వద్దిపర్రు ర్యాంపు–2లో అసలు తవ్వకాలు చేయకపోవడం గమనార్హం. కాగా వద్దిపర్రు –1లో ఇంకా 48,168 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సిందిగా చూపుతున్నారు. పొడగట్లపల్లి–2లో ఇంకా 50,280 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సిందిగా చూపుతున్నారు. అయితే ఇచ్చిన గడువులో తవ్వకాలు చేయలేదు. ఈ కంపెనీలపై కలెక్టర్ అనర్హత వేటు వేయాల్సి ఉంది. కాని మైనింగ్, జిల్లా సాండ్ కమిటీ రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గి మళ్లీ వారికే మిగిలిన పరిమాణం తవ్వడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరడం గమనార్హం.
ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో ఇసుక తవ్వకాలు (ఫైల్)
బ్లాక్ చేసి అమ్మకాలు
జిల్లాలో 15 ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికార ఇసుక ర్యాంపుల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయిన ఇసుక దొరకడం లేదని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా టన్నుకు అదనంగా సాండ్ కమిటీ రూ.500 చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు సగం ర్యాంపులు నిలిచిపోతే ఈ వంకన ఇసుక ధర మరింత పెంచి అమ్మకాలు చేస్తారని వినియోగదారులు వాపోతున్నారు.
నేటి నుంచి జిల్లాలో
7 ర్యాంపుల మూత
7.98 లక్షల మెట్రిక్ టన్నుల
ఇసుక తవ్వకాలకు అనుమతి
స్టాక్ యార్డులలో 1.49
మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ
ర్యాంపులు మూతపడితే కొరత
వస్తుందని వినియోగదారుల ఆందోళన
(మెట్రిక్ టన్నులలో)
ర్యాంపు పేరు తవ్వకాలకు ఇప్పటి వరకు ఇంకా తవ్వకాలు
అనుమతి తవ్వింది చేయాల్సిన ఇసుక
పులిదిండి 33,750 31,755 1,995
వద్దిపర్రు 63,300 15,132 48,168
పొడగట్లపల్లి 54,900 51,186 3,084
అంకంపాలెం 72,750 36,200 36,550
నార్కెడుమిల్లి 31,500 29,240 2,260
పొడగట్లపల్లి–2 60,000 9,720 50,280
వద్దిపర్రు 71,250 0 71,250
మొత్తం 3,87,450 1,73,863 2,13,587

ఇసుక.. మరింత కొరత
Comments
Please login to add a commentAdd a comment