No Headline
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం వచ్చి అప్పుడే 8 నెలలు దాటినా ఆటో కార్మికులకు సంక్షేమాన్ని అందించే పరిస్థితి లేదని జిల్లా ఆటో కార్మికుల యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు వాహన మిత్ర ద్వారా గత ప్రభుత్వం ఏటా ఇచ్చిన రూ.15 వేలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆటో కార్మికులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు వద్ద ఆటో కార్మికులు మంగళవారం సాయంత్రం నిరసన తెలిపారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కనీసం ఆ బోర్డు ద్వారా ఆటో కార్మిలకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకు వచ్చిన రోడ్డు ట్రాన్స్‌పోర్టు యాక్ట్‌ను రద్దు చేయాలన్నారు. మన గ్యాస్ మనకే అనే నినాదంతో ఆటోలకు జిల్లా వ్యాప్తంగా సీజీసీ గ్యాస్ కిట్లను ఏర్పాటు చేసి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని కార్మికులు నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చుల పెరుగుదలను అరికట్టేందుకు డీజీల్, పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక యూనియన్ల ప్రతినిధులు బొక్కా మంగరాజు, మోకా శ్రీనివాసరావు, మట్టపర్తి ప్రసాద్, కాళే భీమరాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రతినిధులు బొలిశెట్టి గౌరీ శంకర్, యాళ్ల ఏడుకొండలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment