సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. మరో 33 మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కూటమి పార్టీ బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1,24,702 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్యత ఓటులోనే 50 శాతం పైచిలుకు సాధించడంతో విజేతగా ప్రకటించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. అనంతరం ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్‌లో 28 వేల ఓట్లను లెక్కించి 8 రౌండ్లల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. మొత్తం 2,18,997 ఓట్లు పోల్ కాగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనవిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను మిగిలిన 8 రౌండ్లల్లో లెక్కించారు. ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థితో పాటు 35 మంది పోటీ చేశారు. వీరిలో స్వతంత్ర అభ్యర్ధి, మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ మాత్రమే సత్తా చాటారు.
30 గంటల పాటు కౌంటింగ్ ప్రక్రియ
గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి రౌండ్‌లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. పీడీఎఫ్ అభ్యర్ధి మొదటి రౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో 28 వేల ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్ధికి 16,520, పీడీఎఫ్ అభ్యర్ధి 5,815 ఓట్లు దక్కాయి. 8 రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు.
సత్తా చాటిన జీవీ సుందర్
మాజీ ఎంపీ జీ.హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మెరుగ్గా ఓట్లు సాధించారు. 8 రౌండ్లు కలుపుకుని 16,183 ఓట్లు దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో కాట్రు నాగబాబు 565, షేక్ హుస్సేన్ 394, కట్టా వేణుగోపాలకృష్ణ 1017, కాండ్రేగుల నర్సింహం 364, కుక్కల గోవిందరాజు 269, కునుకు హేమకుమారి 956, కై లా లావణ్య 365, కొల్లు గౌతమ్ బాబు 317, చిక్కాల దుర్గారావు 665, నోరి దత్తాత్రేయ 565, యళ్ళ దొరబాబు 303, పిప్పళ్ళ సుప్రజ 479, బొమ్మడి సన్నిరాజ్ 398, బండారు రామ్మోహనరావు 709, చిక్కా భీమేశ్వరరావు 254, వానపల్లి శివ గణేష్ 772, హాసేన్ షరీఫ్ 709 ఓట్లు దక్కించుకున్నారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి డిక్లరేషన్ అందించారు.
77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు
పీడీఎఫ్ అభ్యర్ధికి 47,241 ఓట్లు
8 రౌండ్లలో ముగిసిన ఓట్ల లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment