
కాండం తొలిచే పురుగతో అప్రమత్తం
ఐ.పోలవరం: రబీ వరి చేలల్లో కాండం తొలిచే పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం అమలాపురం ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ నందకిశోర్ తెలిపారు. ఇటీవల మండల పరిధిలో వరిచేలను ఆయనతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ ఏవీఎస్ రాజశేఖర్, ఏరువాక వ్యవసాయ అధికారి జె.మనోహర్, మండల వ్యవసాయ అధికారి ఎం.వాణితో కలసి పర్యటించారు. ఈ పర్యటనలో వరి పొలాలను పరిశీలించి, అక్కడక్కడా కాండం తొలిచే పురుగు గమనించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వరి చేలల్లో పురుగులు, తెగుళ్లపై ఆయన పలు సూచనలు చేశారు. ఆయన మాటల్లోనే..
కాండం తొలిచే పురుగు (మొవ్వు చనిపోవుట లేదా మండి పురుగు/తెల్ల కంకి)
పిలక దశలో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి మొక్కలోని మొవ్వు ఆకు చనిపోయి ఎండి పోతుంది. ఈ చనిపోయిన మొవ్వును చేతితో లాగితే సులభంగా చేతికిలోకి వస్తుంది. పొలంలో ఐదు శాతం కంటే ఎక్కువ చనిపోయిన మొవ్వులు లేదా చదరపు మీటరుకు ఒక రెక్కల తల్లి పురుగును గమనించినట్లయితే నివారణ చేపట్టాలి. పంట చిరు పొట్ట దశ నుంచి కంకి బయటకు వచ్చిన తర్వాత కాండం తొలిచే పురుగు ఆశించటం వల్ల కంకి శ్రీతెల్ల కంకి శ్రీ లాగా బయటకు వస్తాయి. దీనివల్ల కంకిలోని గింజలు తోడుకోక తాలు గింజలుగా మారిపోతాయి.
నివారణ
కాండం తొలిచే పురుగు నివారణకు పిలక దశలో లీటరు నీటికి క్లోరి పైరిఫాస్ 20 ఈసీ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2.0 గ్రాములు లేదా క్లోరం ట్రానిలిప్రోల్ 20 ఎస్సీ 0.3 మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
తెల్లకంకి
తెల్లకంకి రాకుండా అరికట్టటానికి పంట అంకురం (కుదురు కట్టే దశ) దశలో ఎకరానికి కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కేజీలు (లేదా) కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు (లేదా) క్లోరంట్రానిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోల చొప్పున వేయాలి. గుళికలు వేసేటప్పడు చేలో నీరు పలచగా వుండాలి.
ఉల్లికోడు (గాల్ మిడ్జి)
ఉల్లికోడు ఆశించడం వల్ల వరి దుబ్బులోని మొవ్వు ఆకు గొట్టం వలె మారి ఉల్లికాడ వలె రూపాంతరం చెందుతోంది. ఇవి ఆశించిన మొవ్వు ఆకులు నిలువుగా గొట్టాల మాదిరిగా మారిపోతాయి. ఇలా మారిన ఆకుల నుంచి వెన్నులు రావు.
నివారణ..
ఎకరాకు 10 కేజీల కార్బోఫ్యూరాన్ 3 ఎ గుళికలు పొలంలో నీరు తగ్గించి చల్లుకోవాలి. ఈ గుళికలు ఏ విధమైన ఎరువులు పురుగు మందులను కలిపి వేయరాదు. గుళికలు చల్లున్నప్పుడు ముక్కుకు మాస్క్, చేతులకు గ్లోవ్స్ కచ్చితంగా ధరించాలి. అలాగే ఉదయం, సాయంత్రం పూట మాత్రమే వేయాలి. మధ్యాహ్నం ఎండ సమయంలో చల్లకూడదు.
కాండం కుళ్లు
(దుబ్బు కుళ్ళు తెగులు)
వరి పంట పిలకలు చేయటం పూర్తి అయిన చేలలో దుబ్బు కుళ్లు గమనించాం. ఈ తెగులు ఆశించటం వలన కాండం లోపల కణుపుల మధ్య భాగమంతా నల్లగా మారడం, పిలకలు కిందకి వాలిపోయి ఎండి పోవుడం, క్రమంగా దుబ్బు అంతా ఎండిపోవడం జరుగుతోంది. వెన్నులో తాలు గింజలు ఏర్పడతాయి.
నివారణ
● పొలంలో మురుగు నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి, వీలయితే పొలంలో నీరు బయటకు తీసి చేను ఒకసారి అరగట్టాలి.
● తెగులు ప్రారంభ దశలో నివారణకు హెక్సాకోనజోల్ 5 ఎస్‌సీ లేదా వాలిడామైసిన్ 3 ఎల్.2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ప్రొపికోనజోల్ 25 ఈసీ 1.0 మిల్లీ లీటర్లు లేదా టెబుకోనజోల్ 25.9 ఈసీ 2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
సస్య రక్షణతో తెగుళ్ల నివారణ
ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ నంద కిశోర్

కాండం తొలిచే పురుగతో అప్రమత్తం

కాండం తొలిచే పురుగతో అప్రమత్తం

కాండం తొలిచే పురుగతో అప్రమత్తం

కాండం తొలిచే పురుగతో అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment