
తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన
కాకినాడ క్రైం: తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన చేశారు. మేం చెప్పింది చేయాలంటూ జులుం ప్రదర్శించారు, నువ్వు మాకు చెప్పే అంత పెద్దదానివా అంటూ చిన్న చూపు చూశారు. మా మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ బెదిరించారు... ఇలా వరుస అవమానాలను తాళలేక పెద్దాడ పీహెచ్‌సీ పరిధిలో పెదపూడి–1 సబ్ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న సునీత బుధవారం ఆత్మహత్యకు యత్నించింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పంపిన వాయిస్ నోట్ ఆధారంగా రైలు కింద పడేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు రైలు పట్టాలపై గుర్తించి రక్షించారు. ఆమైపె జరిగిన వేధింపులను నిరసిస్తూ గురువారం ఏపీ సీహెచ్‌వోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు బాధితురాలితో సహా కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యూష, సురేఖతో పాటు శారదమ్మ అనే ప్రమోటెడ్ సీహెచ్‌వో సునీతను తీవ్ర వేధింపులకు గురి చేశారన్నారు. అసభ్య పదజాలంతో అవమానించారన్నారు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన చేసి మనోధైర్యాన్ని దెబ్బ తీశారని వాపోయారు. ఏడాదిన్నరగా ఏఎన్‌ఎం లేకపోతే ఆ పని కూడా సునీతే చేస్తున్నారనీ, కనీస కనికరం లేకుండా జులుం ప్రదర్శించడం హేయమైన చర్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తనకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులను వివరిస్తూ బాధితురాలు సునీత కన్నీటి పర్యంతమయ్యారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్‌ను కలిసిన నాయకులు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఎంఎల్‌హెచ్‌పీలకు జాబ్ ఛార్ట్ నిర్దేశించి సునీతపై వేధింపులకు పాల్పడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన వైద్యాధికారులు, సీహెచ్‌వోపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసనలో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సిరిపురపు నిస్సీ ప్రియాంక, రాష్ట్ర సమన్వయ కర్త ప్రమోద్ , అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పులి ప్రేమ్ కుమార్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.
వైద్యాధికారుల వేధింపులపై
ఎంఎల్‌హెచ్‌పీల నిరసన దీక్ష
Comments
Please login to add a commentAdd a comment