
ఇంటర్ పరీక్షలకు 787 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శనివారం జనరల్, ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ రెండు పరీక్షలకు జిల్లాలో 787 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 10,911 మంది హాజరు కావాల్సి ఉండగా 10,519 మంది రాశారు. ఒకేషనల్ పరీక్షలకు 2,734 మంది హాజరు కావాల్సి ఉండగా 2,339 మంది హాజరయ్యారు. డీఐఈవో వనుము సోమశేఖరరావు ముమ్మిడివరం ప్రభుత్వ, తార, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించారు.
బాల బాలాజీకి
రూ.3.36 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారికి తల నీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. లక్ష్మీ నారాయణ హోమాన్ని దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి, పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.65,670 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.77,414 విరాళాలుగా అందించారు.
సువర్ణ ఇండియా బాధితులకు
న్యాయం చేయాలి
అమలాపురం రూరల్: అమరావతి హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం సువర్ణ ఇండియా డిపాజిట్ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కాశీ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం త్రిరత్న బుద్ధ విహార్ హాలులో సువర్ణ ఇండియా బాధితుల సమావేశం జరిగింది. వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో 24 బ్రాంచీల ద్వారా రూ.12 కోట్ల డిపాజిట్ల సేకరించి 2014లో ముంచేశారన్నారు. అమలాపురం ప్రధాన కేంద్రంగా 2011లో సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించి డిపాజిట్లు సేకరించారన్నారు. 2016లో కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్ల పేరు మీద ఉన్న ఆస్తులను అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు సీజ్ చేశారని తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి రాజమహేంద్రవరంలోని న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే కంపెనీ ఎండీ బూసి వెంకట నాగవేణు, ఇతర డైరెక్టర్లు కలిసి ఏపీలో పలుచోట్ల సీజ్ చేసిన ఆస్తులను విక్రయించారన్నారు. 2024లో హైకోర్టు తీర్పు ప్రకారం కంపెనీకి చెందిన భూములను నగదు రూపంలో డిపాజిట్ దారులకు చెల్లించాలన్నారు. సమావేశంలో డిపాజిట్‌దారులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు 787 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment