కిం కర్తవ్యం స్వామీ!
ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉన్న పంపా నీటిమట్టం
అన్నవరం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లనే చందంగా మారింది అన్నవరం దేవస్థానం అధికారుల వ్యవహారం. పోలవరం కాలువ పనులు, పంపా గేట్ల మరమ్మతుల పేరిట జనవరి నుంచి పంపా నీటిని సముద్రంలోకి వదిలేస్తూంటే చోద్యం చూశారు. వచ్చే నెలలో శ్రీరామ నవమి, మే నెలలో సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో మేల్కొన్న అధికారులు.. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే స్వామివార్ల చక్రస్నానాలకు ఏలేరు నుంచి పంపాకు నీరు ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌కు నాలుగు రోజుల కిందట లేఖ రాశారు. చక్రస్నాన మహోత్సవాలకు ఏలేరు నుంచి రోజుకు 200 క్యూసెక్కుల నీటిని పంపాకు విడుదల చేయించాలని కోరారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానం, ఇరిగేషన్, పోలవరం అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఏలేరు నుంచి నీరు విడుదల చేస్తే పోలవరం కాలువ అక్విడెక్ట్ పనులకు ఆటంకం కలుగుతుందని పోలవరం అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంపా జలాశయాన్ని, పోలవరం కాలువ అక్విడెక్ట్ పనులను పరిశీలించడానికి ఈ నెల 18న వస్తానని, అప్పుడు దీనిపై పరిశీలించి, నిర్ణయం తీసుకుంటానని చెప్పారని అంటున్నారు.
ముందే చెప్పిన ‘సాక్షి’
వాస్తవానికి ఈ సమస్యను ‘సాక్షి’ ముందే వెలుగులోకి తెచ్చింది. పంపా గేట్ల మరమ్మతులు, పోలవరం అక్విడెక్ట్ పనుల కారణంగా నీటిని దిగువకు వదిలేస్తూండడంతో పంపా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని గత నెల పదో తేదీన ‘అడుగంటినది’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనివలన శ్రీరామ నవమి, సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా దేవస్థానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని పేర్కొంది. అలాగే, ఫిబ్రవరి నుంచి మే నెల వరకూ వివాహాల సీజన్, ఉత్సవాల కారణంగా ఎక్కువ మంది భక్తులు రత్నగిరికి వస్తారని, అందువలన దేవస్థానానికి నీటి అవసరం ఎక్కువవుతుందని తెలిపింది. అప్పట్లోనే దేవస్థానం అధికారులు స్పందించి, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఉంటే.. పంపా నుంచి నీరు పోకుండా బండ్ వేయించి, ఉన్న నీటిని నిలుపుదల చేయిస్తే సరిపోయేది. అలాగే, పోలవరం కాలువ పనులకు అడ్డు లేకుండా దానికి ఇరువైపులా గట్టు వేయిస్తే బాగుండేది. తద్వారా పంపాలో నీరు నిల్వ ఉండేది. కనీసం గత నెల 24న దేవస్థానానికి కలెక్టర్ వచ్చినప్పుడైనా ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే బాగుండేది. కానీ, ఈ సమస్యపై సుమారు నెల రోజులు ఆలస్యంగా దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కలెక్టర్‌కు లేఖ రాశారు.
డెడ్ స్టోరేజీకి చేరువలో..
పంపాలో ప్రస్తుతం నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి దగ్గరగా ఉన్నాయి. పంపా జలాశయంలో గరిష్ట మట్టం 103 అడుగుల వద్ద 0.43 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం నీటిమట్టం 82 అడుగులుంది. 0.014 టీఎంసీల నిల్వలున్నాయి. ఇది 0.007 టీఎంసీలకు తగ్గితే పంపా డెడ్ స్టోరేజీకి చేరుతుంది.
పంపాకు నీరొచ్చే దారేదీ?
శ్రీరాముని, సత్యదేవుని
చక్రస్నానాలకు తప్పని ఇబ్బంది
గత నెలలోనే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
ఆలస్యంగా స్పందించిన
దేవస్థానం అధికారులు
ఏలేరు నుంచి పంపాకు
నీరివ్వాలని ఈఓ లేఖ
సంబంధిత అధికారులతో
కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
కిం కర్తవ్యం స్వామీ!
Comments
Please login to add a commentAdd a comment