వరి చేలలో మోటార్ సైకిల్‌తో రైతుల నిరసన
సాగు నీరందక బీడు వారుతున్నాయని ఆందోళన .
ఉప్పలగుప్తం: కూనవరం పంచాయతీ గరువుపేటలో సాగు నీరందక చేలు బీడుగా మారుతున్నాయని రైతులు వరి చేలలో మోటార్ సైకిల్ నడుపుతూ శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల గోడును పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. ఈ ప్రాంతంలో సాగు నీరందక సుమారు 350 ఎకరాలు బీడుగా మారిందని, వెన్ను ఈనిక దశలో పంట ఉండగా, సాగు నీరందించకపోతే నిరుపయోగంగా మారి నష్టపోతున్నామన్నారు. ఈ విషయమై చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారి నుంచి స్పందన లేదని ఆవేదన చెందారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నీటి సంఘాలు లేనప్పటికీ సాగు నీరు అందేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నీటి సంఘాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. కూనవరం మేజర్ డ్రెయిన్‌పై క్రాస్‌బండ్‌ను ఏర్పాటు చేయడంతో, ఉప్పు నీరు పోటెక్కి పంట కాలువల్లోకి చేరి, కనీసం చేనుకు సాగు నీరు పెట్టుకునే అవకాశం సైతం లేదని వివరించారు. తొలకరి సాగు నష్టపోయామని, అప్పు చేసి దాళ్వా సాగు చేస్తున్నామని, ఉన్నతాధికారులు స్పందించి సాగు నీరందించకపోతే భారీ నష్టాలు తప్పవని రైతులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు చింతా నాగరాజు, వాకపల్లి దొరబాబు, పరమట నాగరాజు, పోద్దోకు బాబులు, బళ్ల నరసింహమూర్తి, వాకపల్లి చిట్టిబాబు, కోలా పల్లపురాజు, బళ్ల సత్యనారాయణ, పరమట సింహాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment