
నేటి నుంచి ఒంటిపూట బడులు
రాయవరం/కొత్తపేట: జిల్లా అంతటా నేటి నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంగా మండుతున్న ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడుల నిబంధన వర్తిస్తుంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటి పూట బడులు వర్తిస్తాయి. పది పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠశాల నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ జిల్లా విద్యా శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒంటి పూట బడులను ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7.45 నుంచి ఎనిమిది గంటలకు అసెంబ్లీ నిర్వహించాలి. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించాల్సి ఉంది.
విద్యుదాఘాతంతో
వివాహిత మృతి
ముమ్మిడివరం: కర్రివానిరేవు పంచాయతీ శివారు చింతావానిరేవుకు చెందిన ఓ వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన రేకాడి ధనకుమారి(23) శుక్రవారం ఉదయం నీళ్లు కాయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త కనకరాజు, మూడేళ్ల పాప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment