భీమేశ్వరుని సన్నిధిలో తెలంగాణ హైకోర్టు జడ్జి
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్‌వీ శరవన్‌కుమార్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. జడ్జి దంపతులకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. రామచంద్రపురం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.నాగేశ్వరరావు నాయక్, ఆర్డీఓ దేవరకొండ అఖిల తదితరులున్నారు.
నేటితో వెబ్ ఆప్షన్ ముగింపు
అమలాపురం రూరల్: జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్ల సర్వీసు ప్రారంభించినట్టు ఆ శాఖ మహిళా సాధికారత అధికారి ఎం.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఇక్కడ తెలిపారు. వెబ్ ఆప్షన్లను శనివారంలోగా అభ్యర్థులు నమోదు చేసుకోవాలని కోరారు. షార్ట్ లిస్టులో ఉన్న వెయ్యి మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారని చెప్పారు. షార్ట్ లిస్ట్ చేసిన మిగిలిన అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. గతంలో జ్ఞానభూమి పోర్టల్ కోచింగ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులూ వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాలని కోరారు.
అమ్మవారి పంచలోహ విగ్రహం సమర్పణ
ఆలమూరు: చింతలూరులో వేంచేసిన నూకాంబిక అమ్మవారికి ఓ భక్తుడు పంచలోహ ఉత్సవ విగ్రహం సమర్పించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ అధినేత, ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్, లక్ష్మీపార్వతి దంపతులు సుమారు రూ.1.25 లక్షలతో 35 కిలోల బరువు కలిగిన పంచలోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. దాతలైన శ్రీనివాసు దంపతులు శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించారు. అమ్మవారి విగ్రహ రూపకల్పన కోసం 30 రోజులు పట్టింది. అయోధ్య రామాలయంలో 25 కేజీల బాలరాముడి పంచలోహ మూర్తిని గతేడాది కార్తిక మాసంలో సమర్పించినట్టు దాత శ్రీనివాస్ తెలిపారు.
భీమేశ్వరుని సన్నిధిలో తెలంగాణ హైకోర్టు జడ్జి
Comments
Please login to add a commentAdd a comment