
స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ కల్పించాలి
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల ముల్యాంకనం విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ కల్పించాలని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ) సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తికి వినతిపత్రం అందించారు. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్లో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల ముల్యాంకన కేంద్రం వద్ద ఎమ్మెల్సీని సంఘ ప్రతినిధులు కలిసి డీఏ కల్పనపై చర్చించారు. సుదూర ప్రాంతాల నుంచి స్పెషల్ అసిస్టెంట్లను ఈ విధులకు నియమించినప్పటికీ ఎలాంటి టీఏ, డీఏలు చెల్లించడం లేదన్నారు. అసంబద్ధమైన ఈ విషయాన్ని రాష్ట్ర ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చొల్లంగి ప్రసాద్, బొంతు వీవీఎస్‌ఎన్ మూర్తి, అమలాపురం జోన్ అధ్యక్ష, కార్యదర్శులు వైఎస్‌వీ రమణారావు, తోట రవి, పి.గన్నవరం జోన్ అధ్యక్ష, కార్యదర్శులు పాయసం శ్రీనివాస్, ముత్యాల కిషోర్ ఉన్నారు.
సృజనాత్మకతను
వెలికితీసే అటల్ ల్యాబ్స్
అమలాపురం రూరల్: విద్యార్థులలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ దోహదం చేస్తాయని అటల్ ల్యాబ్స్ రాష్ట్ర సమన్వయ అధికారి పి.వెంకటేష్ తెలిపారు. అమలాపురం మండల పరిధిలోని పేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ ల్యాబ్‌ను మంగళవారం డీఈవో షేక్ సలీం బాషాతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ పేరూరు పాఠశాల అటల్ ల్యాబ్ కేంద్రంగా ఉందని, దీని పరిధిలో 5 అటల్ స్పోక్ స్కూల్స్, 41 జనరల్ అటల్ ల్యాబ్ స్కూల్స్ పనిచేస్తున్నాయన్నారు. ల్యాబ్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ త్వరలో 26 పీఎంశ్రీ స్కూళ్లలో అటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి నెలా నివేదికను జిల్లా కేంద్ర కార్యాలయానికి సమర్పించాలన్నారు. డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు పాల్గొన్నారు.
12న అమలాపురంలో
జాబ్ మేళా
అమలాపురం రూరల్: జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాబ్‌మేళా పోస్టర్లు, మాండేటరీ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జాబ్‌మేళాను ప్రారంభిస్తారన్నారు. సుమారు 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు.

స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ కల్పించాలి

స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ కల్పించాలి