
పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు
రాయవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మరో 40 రోజుల్లో (ఏప్రిల్ 3–18) విద్యార్థులు ఎదుర్కోనున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమే. ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,205 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 69,124 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు సూచిస్తున్నారు.
సమయం కీలకం
ఈ 40 రోజుల్లో రోజుకు ఏడు గంటల చొప్పున చదివితే పదిలో ఏడు సబ్జెక్టులకు 40 గంటల చొప్పున సరిపోతుంది. ప్రణాళిక సిద్ధం చేసుకుంటే సీ, డీ గ్రేడుల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత..ఏ, బీ గ్రేడుల్లోని వారు ఆశించిన మేరకు మార్కులు సాధించే అవకాశముంటుంది.
గణితం సాధన చేయాల్సిందే. 1,2,4 మార్కుల ప్రశ్నలకు చాయిస్ లేదు. 8 మార్కుల ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నలపై దృష్టి సారిస్తే ఏ,బీ గ్రేడ్ విద్యార్థులు 95కు పైగా మార్కులు సాధిస్తారు. సీ,డీ గ్రేడ్ విద్యార్థులు గ్రాఫ్‌లు, నిర్మాణాలు, పటాలపై దృష్టి సారిస్తే కనీసం 15 మార్కులు సాధిస్తారు. సమితులు, సంభావిత, సాంఖ్యకశాస్త్రం, త్రికోణమితి, వాస్తవ సంఖ్యలు శ్రద్ధగా చదివితే సీ,డీ గ్రేడ్ విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు. ప్రశ్న పత్రం మొత్తం 33 ప్రశ్నలుంటాయి. సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరోటి ఉండదు.
– పతివాడ రవిశంకర్, ఎస్‌ఏ(గణితం), జెడ్పీహెచ్‌ఎస్, కొమరిగిరి, యు.కొత్తపల్లి మండలం
విశ్లేషణాత్మకంగా రాయాలి
తెలుగులో రామాయణంపై అవగాహన కలిగి ఉండాలి. సంఘటనలను క్రమంలో అమర్చగలిగి ఉండాలి. కంఠస్థం చేయకుండా చదివి ఆలోచించడం, సృజనాత్మకతల వల్ల మంచి మార్కులు పొందవచ్చు. పాఠ్యాంశంలోని స్టార్ గుర్తున్న పద్యాలను ఎక్కువసార్లు రాసి సాధన చేయాలి. చక్కని చేతిరాత, వ్యాకరణంపై పట్టు సాధించాలి. లేఖా ప్రక్రియ సాధన చేస్తే సులభంగా మార్కులు సంపాదించవచ్చు. సమాసాలు, సంధులు, అలంకారాలు, వాక్యాల్లో రకాలపై పట్టు సాధించాలి. అవగాహన–ప్రతిస్పందనలో 32, భాషాంశాల్లో 32, వ్యక్తీకరణ, సృజనాత్మకతకు 36 మార్కులు ఉంటాయి.
– బీఎస్ సునీతాలక్ష్మి, ఎస్‌ఏ(తెలుగు), జెడ్పీహెచ్‌ఎస్, ద్రాక్షారామం
మ్యాపులతో మంచి గ్రేడింగ్
’సోషల్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింటింగ్, సమాచార విశ్లేషణ సాధన చేయాలి. 1–12 ప్రశ్నల వరకు ఒక్క మాటలో సమాధానం రాసే ప్రశ్నలున్నాయి. సబ్జెక్టుపై పట్టును సాధిస్తే వీటిని సులువుగా ఆన్సర్ చేయవచ్చు 13 నుంచి 20 వరకు రెండు మార్కుల ప్రశ్నలు, 21–28 వరకు నాలుగు మార్కుల ప్రశ్నలుంటాయి. 29–33 వరకు ఎనిమిది మార్కుల ప్రశ్నలుంటాయి. 29–32 వరకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. మ్యాప్ పాయింటింగ్‌లో పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలను యథాతధంగా ఇవ్వకుండా విద్యా ప్రమాణాలను పరీక్షించేలా ఇస్తారు.
– గరగ సీతాదేవి, ఎస్‌ఏ(సోషల్), జెడ్పీహెచ్‌ఎస్, రాయవరం
భౌతిక శాస్త్రం భయానకం కాదు
’భౌతిక, రసాయన శాస్త్రం కలిపి 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. భౌతికశాస్త్రంలో కాంతి, విద్యుత్ యూనిట్లు, సూత్రాల ఉత్పాదన, గణన, నిత్యజీవిత వినియోగం, భేదాలపై దష్టి పెట్టాలి. రసాయన శాస్త్రంలో కర్బన సమ్మేళనాలు, సమీకరణాలు, పరమాణు నిర్మాణం, లోహ సంగ్రహణ శాస్త్రం, మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలు యూనిట్లపై పట్టు సాధించాలి. శాస్త్రవేత్తల విశేషాలను గుర్తుంచుకోవాలి. ప్రయోగాలు, డయాగ్రమ్స్‌పై దృష్టి సారించాలి.
– డి.ప్రియదర్శిని, ఎస్‌ఏ(పీఎస్), జెడ్పీహెచ్‌ఎస్, పెద్దాపురప్పాడు, కరప మండలం
జీవశాస్త్రాన్ని ఇష్టంగా చదవాలి
ఈ ఏడాది పీఎస్, బయాలజీ ఒకే పేపరు ఉంటుంది. పార్ట్–ఎ పీఎస్ 50, పార్ట్–బి బయాలజీ 50 మార్కులకు ఉంటుంది. 17 నుంచి 33వ ప్రశ్న వరకు బయాలజీ ప్రశ్నలుంటాయి. ప్రయోగాలు, భేదాలు, చిత్రపటాలు, టేబుల్స్‌పై అవగాహన ఉండాలి. చిత్రపటాలు, ప్రయోగశాల కృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. భాగాలు గుర్తించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేలా, రెండు విషయాలను పోలుస్తూ బేధాలను రాయమంటూ ఒక ప్రశ్న కచ్చితంగా వస్తుంది. పాఠ్యాంశంపై, శాస్త్రవేత్తల పరిశోధనలపై పట్టు సాధించేలా అభ్యసనం చేయాలి. సమాధానాలు పాయింట్ల రూపంలో రాస్తే మంచిది.
– మేకా రామలక్ష్మి, ఎస్‌ఏ(బయాలజీ), శ్రీగౌతమి మున్సిపల్ హైస్కూల్, మండపేట
ఆంగ్లంలో గ్రామర్ కీలకం
ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లలో 1–35 వరకు ప్రశ్నలుంటాయి. సెక్షన్–ఎలో మూడు పాసేజ్‌లు పాఠ్యాంశం నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 30 మార్కులు వస్తాయి. పాఠ్య పుస్తకంపై అవగాహనతో 30 మార్కులు సులభంగా సాధించవచ్చు. సెక్షన్–బిలో 16వ ప్రశ్న నుంచి 32వ ప్రశ్న వరకు 17 ప్రశ్నలు 40 మార్కులకు ఇస్తారు. పాఠ్య పుస్తకంలోని గ్రామర్, ఒకాబ్లరీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పాఠ్యాంశం వెనుక ఉన్న గ్రామర్, ఒకాబ్లరీ చదవడం ద్వారా 40 మార్కులు సాధించే వీలుంది. సెక్షన్–సిలో 33–35 వరకు ఇచ్చే ప్రశ్నలతో విద్యార్థుల్లోని క్రియేటివ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, ఎడిటర్ లెటర్, బ్రయోగ్రాఫికల్ స్కెచ్, ఇచ్చిన గ్రాఫ్ లేదా చార్ట్‌కి పేరాగ్రాఫ్ రాయడం చేయాలి. వీటిపై పట్టు సాధిస్తే 30 మార్కులు సాధించే వీలుంది.
– రాయి వెంకటేశ్వరరావు, ఎస్‌ఏ(ఇంగ్లిష్), జెడ్పీహెచ్‌ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం
ఉత్తీర్ణతలో రాజసం
హిందీలో ఉత్తీర్ణతకు 20 మార్కులే ఉండటంతో భాషపై కొంత అవగాహన ఉంటే పాస్ కావొచ్చు. చదవడం, రాయడం, బాగా సాధన చేయాలి. రోజూ అరగంట హిందీకి కేటాయిస్తే 80 శాతం మార్కులు సాధించవచ్చు. గ్రామర్ ఉన్న 1–12 ప్రశ్నలు (థింకింగ్ స్కిల్స్) పాఠానికి మినిమమ్ ఐదు ప్రాక్టీస్ చేయాలి. రోమన్–2లో పద్యం నుంచి ఒకటి, గద్యం నుంచి మూడు పాసేజ్‌లు ఇస్తారు. అవగాహన చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రోమన్–3లో పద్యం నుంచి కవి పరిచయం, గద్యం నుంచి రచయిత పరిచయం రాయాలి. రోమన్–4లో ఎనిమిది షార్ట్ ఆన్సర్ ప్రశ్నలుంటాయి. రోమన్–5 నుంచి చాయిస్ ఇస్తారు. పద్యాల నుంచి రెండు ఇస్తే ఒకటి, గద్యం నుంచి రెండు ఇస్తే ఒకటి రాయాలి. రోమన్–6లో చాయిస్ ఉంటుంది.
– ఆర్.ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఏ(హిందీ),జెడ్పీహెచ్‌ఎస్, కాతేరు, రాజమహేంద్రవరం రూరల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment