పి.గన్నవరం: లంక గ్రామాల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ఊడిమూడిలంక వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారంటే, తు.చ. తప్పకుండా అమలు చేసి చూపిస్తారనడానికి మరో ఉదాహరణగా నిలిచింది. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి ప్రజలకు అవసరమైన వంతెన పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే.
వేలాది మందికి మేలు
పి.గన్నవరం మండల పరిధిలో వశిష్ట గోదావరి నదీపాయ అవతల ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో సుమారు 3,500 మంది నివసిస్తున్నారు. వరదల సమయంలో మూడు నెలల పాటు వారికి పడవల పైనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాల తరబడి ఇక్కడి ప్రజలు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.49.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత ఫైలు చకచకా కదిలింది. అధికారులు శరవేగంతో అన్ని అనుమతులూ మంజూరు చేశారు. చివరిగా ఈ వంతెన నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బాలు నాయక్ ఆమోదముద్ర వేశారు. ఈ వంతెన నిర్మాణానికి ఇక శంకుస్థాపనే తరువాయి. దీంతో ఆయా లంక గ్రామాల ప్రజల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి.
320 మీటర్ల పొడవున..
వశిష్ట నదీపాయపై 320 మీటర్ల పొడవున 7.5 మీటర్ల వెడల్పున వంతెన నిర్మిస్తామని పంచాయతీరాజ్ ప్రాజెక్టు డీఈ అన్యం రాంబాబు తెలిపారు. రెండు అబెక్ట్‌మెంట్ వాల్స్ సహా, ఏడు పిల్లర్లతో వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి ముందు ప్రధాన పంట కాలువపై కూడా వంతెన నిర్మిస్తామన్నారు. పంట కాలువ నుంచి 1.5 కిలో మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మిస్తారని వివరించారు. చైన్నె ఐఐటీ నిపుణుల సూచన మేరకు వంతెన నిర్మాణం జరుగుతుందని చెప్పారు. తాను ఏఈగా ఉన్నప్పటి నుంచి దశాబ్ద కాలంగా ఈ వంతెన కోసం ప్రయత్నిస్తున్నానని.. చివరికి డీఈగా పని చేస్తుండగా సీఎం జగన్ చొరవతో వంతెన పనులు ప్రారంభం కానుండటం ఎంతో ఆనందంగా ఉందని రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. వంతెనకు అన్ని అనుమతులూ ఇచ్చిన సీఎం జగన్‌కు లంక గ్రామాల ప్రజలతో పాటు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment