
రాజమహేంద్రవరం సిటీ: దమ్ముంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ సవాల్ విసిరారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు బతిమలాడితే జగనన్న నరసాపురం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తీరా నెగ్గాక అటు టీడీపీతోఇటు బీజేపీతో శిఖండిలా మంతనాలు చేస్తున్నారంటూ విమర్శించారు.
తమంది పేటీఎం బ్యాచ్‌ను రాజమహేంద్రవరంలో పెట్టుకుని లేనిపోని ప్రచారం చేయిస్తున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన.. ఏ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసినా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో తాను గెలిచి చూపిస్తానన్నారు. ఆవ భూములకు సంబంధించి ఆరోపణలు మానుకోవాలన్నారు. ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు ఆధారమున్నా నిరూపించాలన్నారు. బ్యాంకుల నుంచి బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం తనకు చేతకాదన్నారు. తాను సొంత డబ్బుతోనే రాజకీయాలు చేస్తానని భరత్‌రామ్ పేర్కొన్నారు.