
రాయవరం: పెళ్లంటే నూరేళ్ల పంట అని నమ్మే మన సమాజంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఆ వివాహానికి రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధత అవసరం. వివాహాన్ని చట్టబద్ధం చేయాలనే అంశం చాలామందికి తెలియదు. వివాహానికి చట్టబద్ధత లేకుంటే భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో మాన్యువల్‌గా ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
గతంలో ఇలా..
గతంలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాన్యువల్‌గా నమోదయ్యేవి. వివాహానికి సంబంధించిన ఫొటోలు, ఆధార్ కార్డులు సమర్పించి, ముగ్గురు సాక్షులతో దరఖాస్తు పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చేవారు. వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు పూర్తయితే వివాహానికి చట్టబద్ధత ఇస్తారు. వివాహ శుభలేఖ, పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్ కార్డులు, పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ధ్రువీకరణ పత్రం లేదా మరేదైనా వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులతో సంతకాలు చేయించిన దరఖాస్తును ఇవ్వాలి. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ విధానం అమలవుతోంది.
తగిన ఫీజు చెల్లించి..
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజిస్ట్రేషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఈ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ కావాలి. తర్వాత ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ కార్డులు, ఫొటోలు, పదవ తరగతి ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లించాలి. తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్‌కు ఇస్తే వారు పరిశీలించి సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయ్యాక వివాహ ధ్రువీకరణ పత్రం ఆన్‌లైన్‌లో వస్తుంది. సబ్ రిజిస్ట్రార్ సాధారణ సంతకం కాకుండా డిజిటల్ సంతకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రుసుం సైతం సులభతరంగా చెల్లించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్ అథంటిఫికేషన్ ఆన్‌లైన్‌లో పొందే చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యేక వివాహాలకు మరో విధంగా:
హిందూ వివాహ పద్ధతిలో జరగని వాటిని ప్రత్యేక వివాహాలుగా పరిగణిస్తారు. ప్రత్యేక వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం మరోలా ఉంటుంది. నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలుసుకునేందుకు నెల రోజుల పాటు నోటీసులో ఉంచుతారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ముమ్మిడివరంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటుగా, ఆలమూరు, అల్లవరం, అంబాజీపేట, అమలాపురం, ఆత్రేయపురం, ద్రాక్షారామ, ఐ.పోలవరం, కొత్తపేట, మలికిపురం, మామిడికుదురు, మండపేట, ముమ్మిడివరం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. జిల్లాలో ద్రాక్షారామ, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, రాజోలు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకు సరాసరిన 100 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరిగినట్లు సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment