No Headline
కాకినాడ సిటీ: ఇక అన్నింటికీ ‘ఆధార్’మే.. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ప్రతి పనికీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రజల గుర్తింపునకు సంబంధించి అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌లలో ఇది ప్రధానమైంది. పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, తదితరాలతో పాటు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ పదేళ్లకోసారి గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూప్‌ను సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలను ఉచితంగా కల్పిస్తూ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెసులుబాటు కల్పించింది. అయితే ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉండాలని, పదేళ్ల కిందట తీసుకున్నవారు వాటిని నవీకరించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తీరా అవసరమైనప్పుడు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్‌లో సాంకేతిక తప్పిదాలుంటే అర్హులు సైతం సంక్షేమ ఫలాలకు దూరమయ్యే అవకాశముంది. ఆధార్‌లో పొరపాట్లు ఉంటే ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం విద్యార్థులకు అపార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. కొందరు విద్యార్థుల ఆధార్, పాఠశాల రికార్డుల్లో నమోదైన వివరాలు సరిపోలక పోవడంతో అపార్ నమోదు సాధ్యం కావడం లేదు. దీంతో అత్యవసరంగా ఆధార్‌లో సవరణలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విద్యార్థులందరికీ అపార్ నమోదు తప్పనిసరి చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.
డిసెంబరు 14 వరకూ అవకాశం
ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించిన సేవలను ప్రజలకు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 97 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రాలు సక్రమంగా పని చేయకపోతుండడంతో ఆధార్ అప్‌డేట్‌కు ప్రజలు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు పోస్టాఫీస్‌ల్లో కూడా ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చని ఇండియా పోస్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆధార్ వివరాలను పదేళ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలో ప్రకటించింది. అప్పట్నుంచి పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును ఈ ఏడాది చివరి వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఆధార్ కార్డులో చిన్న మార్పులు చేసుకోవాల్సిన వారు కూడా చేసుకోవచ్చు. అయితే ఏ మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారో, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కార్డుదారు పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని గిరిజనులు, చిన్నారులు, అనాధల కోసం ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథ శరణాలయాల్లో ఈ నెల 19 నుంచి 22 వరకూ, మళ్లీ ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకూ క్యాంపులను నిర్వహించాలని సూచించింది.
ఫ పదేళ్లకోసారి అప్‌డేట్
చేసుకోవాలంటున్న యూఐడీఏఐ
ఫ నిర్లక్ష్యం వహిస్తే
ప్రభుత్వ సేవలకు దూరం
Comments
Please login to add a commentAdd a comment