ఆరోగ్యం.. మహాభాగ్యం
ఆరోగ్యం కోసం వస్తున్నారు
అమలాపురంలో మాకు రెండు హెల్తీ జ్యూస్ హబ్‌లున్నాయి. వీటిలో కూరగాయలతో సహజ సిద్ధమైన జ్యూస్‌లు విక్రయిస్తున్నాం. వ్యాయామం చేసేవారితోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రెండేళ్లు నుంచి వీరి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో గోధుమ గడ్డి, మిక్సిడ్ వెజిటబుల్స్ జ్యూస్‌లు అధికంగా తాగుతున్నారు.
– తులా లోకేశ్వరా రాంబాబు, అమలాపురం
శరీరం తేలికగా ఉంటోంది
ఇటీవల కొంత కాలంగా నేను టీ, కాఫీలు మానేసి గోధుమ గడ్డితోపాటు ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తాగుతున్నాను. వ్యాయామం తరువాత తాగడం వల్ల శరీరం చాలా తేలికగా ఉంటోంది. ఇలా చేయడం వల్ల శరీరంలోకి అనారోగ్యరమైన షుగర్, ఇతర టాక్సిన్స్ వెళ్లడం చాలా వరకూ తగ్గుతోంది. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన విటమిన్లు శరీరానికి అందుతాయి.
– కుడుపూడి
శాంతి భూషణం, సామాజిక కార్యకర్త, అమలాపురం
సాక్షి, అమలాపురం: దైనందన జీవితం.. యాంత్రిక జీవనం.. మారిన ఆహార అలవాట్లు.. వద్దన్నా తన్నుకు వస్తున్న స్థూలకాయం.. చిన్నతనంలోనే రక్తపోటు.. మధుమేహం. ఆరోగ్యంగా ఉన్నా కొట్టుకునే గుండె ఎప్పుడు ఆగిపోతోందో తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ఈ కారణంగా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకూ.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకూ.. పురుషులు.. మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. నడక.. వ్యాయామం.. యోగా వంటివే కాకుండా ఆహార అలవాట్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ.. వీటిని మొలకెత్తించి ఆహారంగా తీసుకుంటున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరుగుతోంది. వీటిని సలాడ్‌ల రూపంలో నేరుగా తినడమే కాదు.. వడలు, పునుగులు, అట్లు రూపంలో అల్పాహారంగా, కూరల రూపంలో తయారు చేసుకుని ఆహారంగా భుజిస్తున్నారు. వీటితోపాటు చిరు ధాన్యాల వినియోగం కూడా పెరుగుతోంది. ఆహారంగా, జావల రూపంలో తీసుకుంటున్నారు. మొలకల్లో విటమిన్‌లు ఏ, సీ, బీ1, బీ6, కే ఉంటున్నాయి. ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, పీచు, ఫోలేట్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. చిరు ధాన్యాల్లో విటమిన్ బీ12, బీ17, బీ6 అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనితోపాటు ప్రతి రోజూ ఉదయం ఆనబ, గుమ్మడి జ్యూస్‌లు తాగేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మైక్రోగ్రీన్స్‌గా గోధుమ గడ్డి జ్యూస్‌కు గుర్తింపు రావడంతో సహజ సిద్ధం ఆహారాన్ని ఇష్టపడేవారు అధికంగా తాగుతున్నారు. విటమిన్ ఏ, బీ, సీ, ఈ అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తం నేరుగా తీసుకున్నట్టేనని నిపుణులు చెబుతుంటారు.
ఆరోగ్యం.. ఉపాధికి మార్గం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యకరమైన జ్యూస్‌లు, ఆహారం అందించే దుకాణాలు పెరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయలు, పండ్లు వంటి వాటిని సేకరించడంతోపాటు రంగుల, ఐస్, పంచదార వంటి వాటితో సంబంధం లేకుండా ఈ జ్యూస్‌లను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఉసిరి, సొరకాయ, క్యారెట్, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీట్‌రూట్, కాకర, కీర వంటి వాటితోపాటు గోధుమ గడ్డి, కలబండ, మునగ ఆకులతో సైతం జ్యూస్‌లు తయారు చేస్తున్నారు. ఈ జ్యూస్‌లలో జీలకర్ర, అల్లం, మిరియాలు, వాము, మెంతులు, సబ్జాలు కలిపి అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని వంటి పట్టణాలు, రావులపాలెం, అనపర్తి, ఏలేశ్వరం, కొత్తపేట, మలికిపురం, రాజానగరం వంటి ఒక మోస్తరు పట్టణ ఛాయలున్న గ్రామాల్లో వీటి సంఖ్య పెరిగింది. ఇటువంటి దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నవారు అధికంగా ఉన్నారు. ఈ జ్యూస్‌లతోపాటు పండ్లు.. పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు, అలాగే డ్రై ఫ్రూట్‌లు, మిలెట్‌లతో తయారు చేసే మాల్ట్‌లు, ఆహార పదార్థాల వినియోగం సైతం పెరిగాయి. ఇక మొలకలైతే దుకాణాలతోపాటు జిమ్ సెంటర్లు, యోగా సెంటర్లలో నేరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలకు, జిమ్‌లకు వచ్చేవారు వీటిని అధికంగా వినియోగిస్తున్నారు.
పెరుగుతున్న ఆరోగ్య స్పృహ
కూరగాయలు, పండ్ల రసాలు,
మొలకలు, చిరుధాన్యాలకు ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లాలో రోడ్ల వెంబడి
వెలుస్తున్న దుకాణాలు
ఆరోగ్యం.. మహాభాగ్యం
ఆరోగ్యం.. మహాభాగ్యం
ఆరోగ్యం.. మహాభాగ్యం
Comments
Please login to add a commentAdd a comment