యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు
● రోడ్డున పడ్డ 10 వేల కుటుంబాలు
● అధికార పార్టీ నాయకులకు
కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం
● కలెక్టరేట్ వద్ద బోట్స్‌మెన్ సొసైటీల
కార్మికుల ఆందోళన
సీటీఆర్‌ఐ: డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారని జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు అన్నారు. సోమవారం బోట్స్ మెనన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీలను తొంగలో తొక్కుతోందని విమర్శించారు. బోట్స్ మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించడం వలన 40 అడుగులు లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు, ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం గమన్ బ్రిడ్జి పిల్లర్‌కు ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి పిల్లర్లు కూడా బలహీనపడ్డాయని తెలిపారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడం వలన గోదావరి నదిలో 40 అడుగుల లోతు వరకు గోతులు ఏర్పడడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యవాత పడుతున్నారని వివరించారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్ మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణ దేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment