గోల్డ్ లోన్ బాధితులకు నెల రోజుల్లో న్యాయం
తుని రూరల్: తేటగుంట కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల అవకతవకలు వాస్తవమేనని, బాధితులందరికీ నెల రోజుల్లో న్యాయం చేస్తామని ఇన్‌చార్జి బ్రాంచి మేనే జర్ ఏసుదాసు చెప్పారు. ‘కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల గోల్‌మాల్’ శీర్షికన ‘సాక్షి’ శనివారం వార్త ప్రచురించిన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి, రుణాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్నారు. ఇన్‌చార్జి మేనేజర్‌ను కలసి వారి బంగారం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని, ఈ ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని వారికి ఏసుదాసు బదులిచ్చారు. ఇప్పటికే మేనేజర్ సహా ముగ్గురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా చూస్తామని చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. గోల్డ్ లోన్ల గోల్‌మాల్‌లో అప్రైజర్ ప్రధాన పాత్ర ఉండటంతో తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 160 ఖాతాల్లో గోల్డ్ లోన్ల అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది రుణం తిరిగి చెల్లించి, బంగారు నగలు తీసుకు వెళుతున్నారు. నగలు తక్కువ ఉన్న బాధితులు ఏయే వస్తువులు గోల్‌మాల్ అయ్యాయో పేర్కొంటూ బ్యాంకుకు ఫిర్యాదులు చేస్తున్నారు.
కౌన్సిలర్ ఇంటిపై దాడి
సామర్లకోట: స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఇంటిపై అదే ప్రాంతానికి చెందిన కొంత మంది గురువారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు హరిబాబు గురువారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వస్తున్న సమయంలో కొంత మంది తన కారుకు అడ్డంగా వచ్చారని, కారు అద్దాలు పగులగొట్టారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యానికి, తన ఇంటిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment