సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలోని రాంబాగ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాశర్లపూడికి చెందిన నిమ్మకాయల వ్యాపారి బోణం బాపిరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. దేవస్థానంలో వ్యాపారం ముగించుకుని బైక్‌పై గ్రామ సరిహద్దుకు వచ్చేసరికి ఎదురుగా రావులపాలెం నుంచి అంతర్వేది ఆలయానికి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువు బి.వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు.
ప్రేమించి మోసగించినందుకు కేసు
ఐ.పోలవరం: ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక యువతిని మోసం చేయడంపై పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కేశనకుర్రు గ్రామానికి చెందిన ఒక యువతి, కొమరగిరి గ్రామానికి చెందిన చెయ్యేటి బాల సురేంద్ర కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో సురేంద్ర అంగీకరించకపోవడంతో నమ్మి మోసపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఎస్సై శ్రీనివాసరెడ్డి ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
6 కాసుల బంగారు గొలుసు చోరీ
ఉండ్రాజవరం: మండలంలో మోర్త గ్రామంలో పోతాప్రగడ సూర్యకుమారి ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు కాసుల బంగారు గొలుసును చోరీ చేశారు. సూర్యకుమారి తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి బెడ్‌రూమ్‌లో తలుపులు దగ్గరగా వేసుకుని పడుకున్నామని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో అలజడికి మెలకువ వచ్చి దొంగదొంగ అని అరవగా ఆ వ్యక్తి వెనుక గుమ్మం నుంచి పారిపోయినట్లు ఆమె తెలిపారు. తమకు అనుమానం వచ్చి తలదిండు తీసి చూడగా అక్కడ పెట్టుకున్న సుమారు ఆరు కాసుల బంగారం గొలుసు కనిపించకుండా పోయిందన్నారు. సూర్యకుమారి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు.