
ఇన్నోవేషన్ హబ్‌కు రెండెకరాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు త్వరలో రెండెకరాల స్థలాన్ని గుర్తించనున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ అంశంపై మాట్లాడారు. ఈ హబ్ ఫలవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, కార్యాచరణ లక్ష్యంగా గుర్తించిన వ్యక్తులకు పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో, నూతన ఆవిష్కరణలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, గ్రీన్ కోర్, ఓఎన్‌జీసీ, గెయిల్, ఇతర ఇన్నోవేటివ్ ఏజెన్సీలు, ఎన్‌ఐటీఏ, జేఎన్‌టీయూ నిపుణులు, పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, ఇతర సమన్వయ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏలూరులో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర స్థాయి పోటీల్లో కాకినాడ క్రీడాకారులు ప్రతిభ చూపి, 3 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలు అందుకున్నారు. జి.సురేష్ కుమార్ 100, 200 మీటర్లు, కె.సత్యదుర్గ బోసే గేమ్, కె.ప్రేమ్‌కుమార్ 200, 100 మీటర్లు రన్నింగ్‌లో ప్రతిభ చూపి, ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కో ఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది గురువారం అభినందించారు.