
దుర్గామాతలకు ఘనంగా హోమాలు
అన్నవరం: రత్నగిరి దుర్గామాతలుగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి చైత్ర అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం ఘనంగా ప్రత్యంగిర, చండీ హోమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. కాగా, పది రోజులుగా తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న చైత్ర మాస పూజలు ఆదివారం నిర్వహించిన చండీహోమంతో ముగిశాయి. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం చండీహోమం నిర్వహించారు. సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, చెల్లపిళ్ల ప్రసాద్, కనకదుర్గ ఆలయ అర్చకుడు చిట్టెం హరగోపాల్, పరిచారకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం అనంతరం పండితులు వేదాశీస్సులు అందజేసి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. కనకదుర్గ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: తలుపులమ్మ లోవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అమ్మవారిని 25 వేల మంది భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,21,500, పూజా టికెట్ల ద్వారా రూ.73,380, కేశఖండన టికెట్ల ద్వారా రూ.8,940, వాహన పూజలకు రూ.1,730, కాటేజీల ద్వారా రూ.33,060, విరాళాలు రూ.66,458 కలిపి మొత్తం రూ.3,05,068 ఆదాయం సమకూరిందని వివరించారు. గంధామావాస్య సందర్భంగా అమ్మవారిని, ఆలయాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు.
కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

దుర్గామాతలకు ఘనంగా హోమాలు