రైల్వేల్లోనూ ‘ప్రైవేటు’ బాదుడు! | privatisation in indian railways | Sakshi
Sakshi News home page

రైల్వేల్లోనూ ‘ప్రైవేటు’ బాదుడు!

Published Tue, Aug 4 2020 12:54 AM | Last Updated on Tue, Aug 4 2020 12:54 AM

privatisation in indian railways - Sakshi

రైల్వేలకు విడిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే సంప్రదాయానికి 2017లో వీడ్కోలు ఇచ్చి, దాన్ని సాధారణ బడ్జెట్‌లో భాగం చేసినప్పుడే ఆ శాఖ రూటు మారబోతున్నదని అందరికీ అర్థమైంది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టడానికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేది చెప్పినట్టు ఈ నిర్ణయం రైల్వేలను రెండుగా విడగొడుతుంది. సకల సౌకర్యాలతో, మెరుగైన సీట్లతో మెరిసే సంపన్నుల రైళ్లు... నాసిరకంగా అఘోరించే నిరుపేదల రైళ్లు వుంటాయన్నది ఆయన అభిప్రాయం. సంపన్నుల రైళ్లలో చార్జీలకు పరిమితి లేదని, ఏ కంపెనీకి ఆ కంపెనీయే చార్జీలను నిర్ణయించుకోవచ్చునని తాజాగా రైల్వే శాఖ చెబుతోంది. కనుక ప్రైవేటీకరణ వల్ల పోటీ పెరిగి రైల్వే చార్జీలు తగ్గుతాయనుకున్న వారంతా డీలా పడక తప్పదు.  వచ్చే అయిదేళ్లలో రైల్వేలకు రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి రైల్వేలను బలోపేతం చేస్తామని 2015లో కేంద్రం ప్రకటించింది.

కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాత రైళ్లు సమకూర్చుకోవడం ధ్యేయమని తెలిపింది. అయితే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నడిచే రైళ్లకు అనుమతిస్తారని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. రైల్వేల్లో వుండే మరిన్ని విభాగాలు ప్రైవేటు సంస్థలకు వెళ్లొచ్చనుకున్నారు. దేన్న యినా ఎదుగూ బొదుగూ లేకుండా వదిలేస్తే ఏమవుతుందో రైల్వే శాఖ కూడా గత కొన్ని దశాబ్దాలుగా అలాగే అయింది. కొత్తగా ట్రాక్‌ల పొడిగింపులో, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంలో, ఇతరత్రా కీలక విభాగాలను విస్తరించడంలో హేతుబద్ధత లేని నిర్ణయాలు తీసుకున్న రైల్వే మంత్రుల వల్ల ఆ శాఖ క్రమేపీ నీరసించడం మొదలుపెట్టింది. తమ స్వరాష్ట్రాలకు కీలకమైన ప్రాజెక్టులు, రైళ్లు తీసుకుపోవడానికి చూపినంత శ్రద్ధను, ఆ శాఖకు జవసత్వాలివ్వడానికి అవసరమైన ప్రతిపాదనల రూపకల్పనపై పెట్టలేకపోయారు. ఏ రైల్వే బడ్జెట్‌ను తిరగేసినా ఇదే కథ. ఆదాయం మెరుగ్గా వున్న రైల్వే జోన్లపై శ్రద్ధ, వాటి పరిధిలో మరింత ఆదాయం రాబట్టేం దుకువున్న అవకాశాలపై ఏనాడూ దృష్టి లేదు. రైల్వే మంత్రులుగా వున్నవారు డిమాండుతో సంబంధం లేకుండా స్వరాష్ట్రాలకు రైళ్లు పెంచుకోవడం, కోచ్‌ ఫ్యాక్టరీలు తెచ్చుకోవడం, అదనపు రైల్వే లైన్ల మంజూరు చేయడం వంటివి ఇష్టానుసారం సాగించారు. పర్యవసానంగా రైల్వే నానా టికీ నష్టాల్లో కూరుకుపోతే ప్రైవేటీకరణే జవాబన్న వాదన తీసుకొచ్చారు.

నిజానికి ప్రైవేటు రంగం, పబ్లిక్‌ రంగాల్లో ఏది మెరుగైందన్న ప్రశ్న అర్ధరహితమైనది. సమర్థవంతంగా నిర్వహించగలిగితే ఏ రంగంలోని సంస్థలైనా లాభార్జనలో ముందుంటాయి. ఇందుకు భిన్నంగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్న ప్రచారం పెరిగింది. దేన్నయినా సమర్థవంతంగా నిర్వహించడం, లాభాల బాట పట్టించడం ప్రైవేటు సంస్థలకే సాధ్యమన్న భ్రమలు కల్పించారు. వాటి నిర్వహణ నిజంగా  మెరుగ్గా వుంటే రుణాలు ఎగ్గొట్టినవారి జాబితాలో ఆ సంస్థలే అధికంగా ఎందుకున్నాయో చెప్పాలి. తాజా లెక్కల ప్రకారం మన బ్యాంకులకు వివిధ కార్పొరేట్‌ సంస్థల బకాయిలు రూ. 7.27 లక్షల కోట్ల పైమాటే. రైల్వేలను ప్రైవేటీకరించడంవల్ల అంతా బాగుపడుతుందని చెప్పడం ఎంతమాత్రం సరైంది కాదు. బ్రిటన్‌లో నాలుగు సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేటు రైళ్లుండేవి. కానీ 1947లో క్లెమెంట్‌ అట్లీ నాయకత్వంలోని లేబర్‌ ప్రభుత్వం రైల్వేలను జాతీయం చేసింది. కానీ 1993 చివరినుంచి జాన్‌ మేజర్‌ నాయకత్వంలోని కన్సర్వేటివ్‌ ప్రభుత్వం ప్రైవేటీకరణ పల్లవి అందుకుంది.

 ప్రస్తుతం దాదాపు 16 సంస్థలు రైల్వే సర్వీసులు నడుపుతున్నాయి. ప్రజానీకం అవసరాలు కాక, లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ఆ సర్వీసుల వల్ల ప్రయోజనం లేదని ప్రజానీకం చెబుతోంది. పైపెచ్చు ట్రాక్‌ల నిర్వహణ వగైరాలు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరగడంతోపాటు ఎవరికి వారు తమ బాధ్యత లేదన్నట్టు ప్రవర్తించే తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యలు మన దగ్గర తలెత్తవన్న గ్యారెంటీ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ప్రైవేటు రైళ్లకు రైల్వే శాఖ తమ తరఫున ఒక డ్రైవర్‌నూ, గార్డును ఇస్తుంది. ఇతర సిబ్బందిని ప్రైవేటు సంస్థలే నియమించుకోవాల్సివుంటుంది. ప్రైవేటు బస్సుల మధ్య పోటీ, వాటివల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుంచుకుంటే రైల్వే ప్రైవేటీకరణ దేనికి దారితీస్తుందో అంచనా వేసుకోవచ్చు.

రైల్వేలకు నష్టాలు ఎందుకు వస్తున్నాయో, ఏ విధానాలు, నిర్ణయాలు అందుకు దారితీశాయో సమూలంగా సమీక్షించాలి. సమగ్రంగా చర్చ జరగాలి. అలా గుర్తించిన లోపాలను సవరిస్తే అది మళ్లీ పుంజుకుంటుంది. పేదరికం, వెనకబాటుతనం వున్న మన దేశంలో సాధారణ ప్రజానీకానికి దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు పోవడానికి చవకైన ప్రయాణ సాధనం రైల్వేలే. నిత్యం రెండున్నర కోట్లమంది ప్రయాణికుల్ని, లక్షలాది టన్నుల సరుకుల్ని వివిధ ప్రాంతాలకు తరలి స్తున్న మన రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో వుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికున్న 53,596 కిలోమీటర్ల రైలు మార్గం పెద్దగా పెరిగింది లేదు. రైల్వే శాఖ ఆర్జించిన ప్రతి రూపాయిలో 98.44 పైసలు నిర్వహణకే సరిపోతోందని రెండేళ్లక్రితం కాగ్‌ నివేదిక లెక్కగట్టింది. ప్రజా రవాణాను కేవలం లాభార్జనగా మాత్రమే పరిగణించకూడదు. డిమాండ్‌ అధికంగా వున్న ప్రాంతాల్లో రైళ్ల సంఖ్య పెంచి, అది తక్కువున్న ప్రాంతాల్లో సరిపడా సంఖ్యలో రైళ్లు నడిపితే ఇంత చేటు నష్టం రాదు. కేంద్రం రైల్వేల ప్రైవేటీకరణపై పునరాలోచించాలి. ఈలోగా ప్రైవేటు రైళ్లలో అపరిమితంగా చార్జీలు వసూలు చేయొచ్చన్న నిబంధన రద్దు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement