సెల్ఫ్‌గోల్‌ రాజకీయం! | Sakshi Editorial On Congress And Rajasthan Politics | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌గోల్‌ రాజకీయం!

Published Wed, Sep 28 2022 2:55 AM | Last Updated on Wed, Sep 28 2022 2:55 AM

Sakshi Editorial On Congress And Rajasthan Politics

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెడుతుంది! కాంగ్రెస్‌లో పరిస్థితి ఇప్పుడు అదే! కొన్నేళ్ళుగా రాష్ట్రం వెంట రాష్ట్రంగా అధికారం చేజార్చుకుంటూ, దేశ రాజకీయ పటంపై పట్టు కోల్పోతున్న పార్టీలో ఇప్పుడు అధిష్ఠానంపై అనుయాయుల ధిక్కార స్వరం గట్టిగా వినపడుతోంది. ఆదివారం రాజస్థాన్‌లో 90 మందికి పైగా అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రంతో అధిష్ఠానాన్ని బెదిరించినంత పనిచేయడం అందుకు తాజా ఉదాహరణ.

ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాత్‌ను జైపూర్‌ నుంచి తప్పించి, ఢిల్లీలో పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టి కథ నడపాలనుకున్న అధినేత్రి సోనియా గాంధీ పరివారానికి ఇది అనూహ్య పరిణామం. నలభయ్యేళ్ళుగా నమ్మినబంటు అనుకున్న వ్యక్తి జైపూర్‌ నుంచి ఢిల్లీకి రావడానికి ఠలాయించడం ఒక ఎల్తైతే, అధిష్ఠానం అనుకుం టున్న సచిన్‌ పైలట్‌ వద్దనీ, తమ వాడే కొత్త సీఎం కావాలనీ అతని అనుయాయులే ‘క్రమశిక్షణా రాహిత్యం’తో ప్రవర్తించడం మరో ఎత్తు. రానున్న పార్టీ ప్రెసిడెంట్‌ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన పెద్దలు తీరా షోకాజ్‌ నోటీసులతో ధిక్కార తుపానును నియంత్రించే పనిలో పడాల్సి వచ్చింది. 

కొన్నేళ్ళుగా దేశరాజకీయాల్లో తన ఉనికినీ, ప్రాసంగికతనూ నిలబెట్టుకోవడం కోసం కిందా మీదా పడుతున్న కాంగ్రెస్‌కు ఇది కష్టకాలం. కాంగ్రెస్‌ ఇప్పుడు ఒంటరిగా పాలిస్తున్న రాష్ట్రాలు రెండే – రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌. అక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బోలెడన్ని సమస్యలున్నాయని తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. చిత్రం ఏమిటంటే – ప్రతిచోటా ప్రత్యర్థుల కన్నా స్వపక్షీయుల తోనే కాంగ్రెస్‌ కకావికలవుతోంది. ప్రతిసారీ తన వేలితోనే తన కళ్ళు పొడుచుకుంటోంది.

దశాబ్దా లుగా పార్టీలో అనేక హోదాలు అనుభవించి, క్లిష్టసమయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు పట్టు కొమ్మంటే, తానింకా రాజస్థాన్‌ సీఎం కుర్చీనే పట్టుకొని వేళ్ళాడాలనుకుంటున్నట్టు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన 71 ఏళ్ళ గెహ్లాత్‌ ప్రవర్తించడం విడ్డూరం. అంతా అనుకుంటున్నట్టు జరిగితే నేడో రేపో పార్టీ మొత్తానికీ పెద్ద అనిపించుకోవాల్సిన నేత చివరకు పైలట్‌తో పాత లెక్కలు తేల్చుకో వాలనుకోవడం, ఢిల్లీ వెళ్ళినా జైపూర్‌ తన గుప్పెట్లోనే ఉండాలనుకోవడం స్థాయికి తగిన పని కాదు. 

సీఎం పీఠం కోసం రెండేళ్ళ క్రితం కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలసి, పార్టీపై తిరుగుబాటుకు సిద్ధపడిన సచిన్‌ పైలట్‌ కూడా తక్కువ తినలేదు. అప్పట్లో బీజేపీలోకి దూకడానికీ సిద్ధమై, రాహుల్‌ తదితరుల బుజ్జగింపుతో ఆఖరికి ఆగిన చరిత్ర ఆయనది. ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ పీసీసీ పీఠం పోయినా, సీఎం కుర్చీపై ఆశతోనే ఆయన పళ్ళబిగువున పార్టీలో కథ నడుపుతున్నారు.

గెహ్లాత్‌ ఢిల్లీకి వెళితే, ముఖ్యమంత్రి అవుతానన్న ఆయన ఆశలు ఇప్పుడు ఎంత వరకు ఫలిస్తాయన్నది చెప్పలేం. పార్టీపై పట్టు సడలిన అధిష్ఠానమేమో మనిషికో మాట ఇచ్చినా, ఇప్పుడేమో ఏదీ నెరవేర్చలేని దుఃస్థితిలో పడిపోయింది. ఈ క్షణంలో గెహ్లాత్‌ వైపు మొగ్గితే, వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్‌లో పైలట్‌ పక్క పార్టీల వైపు చూసే ప్రమాదం ఉంది.

అవునన్నా, కాదన్నా రాజస్థాన్‌లో సంక్షోభానికి గెహ్లాత్‌ ఎంత కారణమో, అధిష్ఠానమూ అంతే కారణం. ఒకప్పటిలా శాసనసభా పక్ష అభిమతాన్ని పెడచెవినపెట్టి, తమ ఆదేశాన్ని వారిపై రుద్దాల నుకోవడం పార్టీ పెద్దల అపరాధం. కళ్ళూ చెవులూ విప్పార్చుకొని, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసు కోలేని చేతకానితనం. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి దాకా కనీసం పైకి తటస్థంగా ఉన్నట్టు కనిపించాలని గాంధీ పరివారం చూసింది. తీరా రాజస్థాన్‌ రగడతో ఆ వ్రతాన్ని వదిలేయాల్సి వచ్చింది.

ఒకపక్క అధిష్ఠానానికి మింగుడుపడని ‘జి–23’ బృందంలో ఒకరైన శశిథరూర్‌ నామినే షన్‌ వేస్తున్నారు. మరోపక్కన తాజా రాజస్థాన్‌ ఘటనలతో గెహ్లాత్‌ బదులు బరిలోకి దింపేందుకు తమ మాట వినే మరో విశ్వాసపాత్రుడు ఎవరా అని అధిష్ఠానం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.  

రాష్ట్రాల్లో వివిధ వర్గాల మధ్య సయోధ్య కోసం అలవిమాలిన వాగ్దానాలిచ్చి, ఆఖరుకు బొక్కబోర్లాపడడం అధిష్ఠానానికి అలవాటుగా మారింది. పంజాబ్‌లో అప్పటి సీఎం అమరీందర్‌ సింగ్, సిద్ధూల విషయంలో అదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్‌ చేజారింది. వచ్చే ఏడాదే ఎన్నికలు జరిగే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో సైతం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవు తోంది.

ప్రతిచోటా గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ పెద్దలకు ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ పరిస్థితి. దృఢమైన నిర్ణయాలు తీసుకోలేక, తీసుకున్న నిర్ణయాలతో వచ్చిపడ్డ సంక్షోభాలను పరిష్కరించలేక అధిష్ఠానం చేష్టలుడిగి చూస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడారు. 

ఇప్పుడు పార్టీలో అందరూ తమ మాట వినేలా చేయాలంటే, వ్యక్తిగత ఛరిష్మాతో ఎన్నికల్లో సాధించే ఓట్లు, గెలిచే సీట్లే గాంధీ పరివారానికి కీలకం. పార్టీ కిరీటాన్ని ప్రస్తుతానికి కాదన్న రాహుల్‌ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ‘భారత్‌ జోడో యాత్ర’తో ఆ పనిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే, అత్యధిక శాతం యువతరం ఉన్న దేశంలో ఏడెనిమిది పదుల వయసు నిండిన నేతలతోనే ఇప్పటికీ రాజకీయం నెరపాలనుకోవడం కాంగ్రెస్‌ చేస్తున్న తప్పిదం.

యువతరంతో అనుబంధం పెంచుకోవడానికి ఆ పార్టీ శ్రమించాలి. పార్టీలోనూ, పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ యువతరానికి పగ్గాలిచ్చి, కొన్నేళ్ళుగా తాము చెబుతున్నది చేతల్లో చూపాలి. నాలుగేళ్ళ క్రితం రాజస్థాన్‌ ఎన్నికల్లో గెలిచినప్పుడే ఆ పని చేసి ఉంటే, ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో! రోజుకో రంగు మారుతున్న రాజస్థాన్‌ రాజకీయం అధిష్ఠానానికి చెబుతున్న పాఠమిదే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement