రాజకీయాల్లో సంక్షోభాలు సహజమే కానీ, నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణించడం కష్టమే. జాతీయ వేదికపై మోదీ ఆవిర్భావం, బీజేపీ దూకుడు ఆరంభమైనప్పటి నుంచి వరుస ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది. కర్ణాటకలో శనివారం దక్కిన ఘన విజయాన్ని ఆస్వాదించక ముందే అక్కడ సీఎం సీటుకై ప్రత్యర్థుల పోటీ మూడు రోజులుగా సాగుతూ పార్టీకి తలనొప్పిగా తయారైంది.
మరోపక్క కన్నడనాట పోలింగ్‌కు సరిగ్గా ముందురోజు రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వంపైనే మళ్ళీ ధ్వజమెత్తి, పాత కుంపటి కొత్తగా రాజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వ్యవహారంతో అధిష్ఠానానికి తలబొప్పి కడుతోంది. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలున్న వేళ రాజస్థాన్‌లో పొంచివున్న అంతర్గత తిరుగుబాటుతో పార్టీ సతమతమవుతోంది. అజ్మీర్ నుంచి జైపూర్ దాకా 5 రోజులు 125 కిలోమీటర్ల ‘జన్ సంఘర్ష్ పాద యాత్ర’ చేసిన సచిన్, సోమవారం ముగింపు ర్యాలీలో అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని సొంత పార్టీ సర్కారుకే ఇచ్చిన అల్టిమేటమ్ అలాంటిది మరి. మరో 15 రోజుల్లో, మే నెలాఖరుకల్లా తన డిమాండ్లను నెరవేర్చకపోతే, రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతానన్న సచిన్ గర్జన ఆందోళన రేపుతోంది.
తాజా హెచ్చరికతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌కూ, ఆయన జూనియర్ సహచరుడు సచిన్ పైలట్‌కూ మధ్య కొన్నేళ్ళుగా సాగుతున్న పోరాటం కీలక దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. సచిన్ డిమాండ్లు మూడు: ‘అవినీతిమయ’ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి, నిపుణులతో పునర్వ్యవస్థీకరించాలి. పేపర్ లీకులతో ఉద్యోగ భర్తీ పరీక్షలు రద్దు చేసినందున యువతరానికి తగిన పరిహారం చెల్లించాలి. 2013 నుంచి 2018 వరకు పాలన సాగించిన మునుపటి వసుంధరా రాజె సర్కార్ అవినీతిపై నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి.
నిజానికి, అధిష్ఠానం హెచ్చరించి ఏప్రిల్ 10న జైపూర్‌లో ఒక రోజు నిరసన నిరాహార దీక్ష, ఇప్పుడీ యాత్ర చేసి, తాజాగా డిమాండ్లు నెరవేరకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదంటూ సచిన్ పూర్తిస్థాయి ధిక్కార స్వరంలోకి దిగిపోవడం గమనార్హం. తాను చేస్తున్న ఈ పోరాటం పార్టీ మీద, వ్యక్తుల మీద కాదు... అవినీతిపైన, యువతరం కోసమని ఈ యువ నేత పైకి చెబుతున్నారు. కానీ, ఆయన గురిపెట్టింది తనను సీఎం కానివ్వకుండా చేసిన అశోక్ గెహ్లోత్‌ను అనీ, అసలు లక్ష్యం సీఎం పీఠమనీ బహిరంగ రహస్యం.
అశోక్‌కి చెప్పులో రాయి చెవిలో జోరీగలా తయారైన సచిన్‌ను అంత తొందరగా పక్కన పెట్టడం పార్టికి కష్టమే. ఎందుకంటే, ఆయన కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న గుజ్జర్ల వర్గానికిచెందిన నేత. పైగా యువతరంలో పాపులర్. పైగా, వయసు మీరిన అశోక్ పార్టీకి గతమైతే, 45 ఏళ్ల యువ సచిన్ పార్టీకి అవసరమైన భవిష్యత్తు. సచిన్ పార్టీని వీడినా, సొంత కుంపటి పెట్టుకున్నా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే. గడచిన 2018 ఎన్నికల్లో పీసీసీ రథసారథిగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించిన చరిత్ర సచిన్‌ది.
అప్పుడే సీఎంను చేస్తామని సచిన్‌కు మాటిచ్చి, అశోక్‌తో రాజీ ఫార్ములాలో డిప్యూటీ సీఎంగా సరిపుచ్చి, అనివార్యతలు ఏమైనా గడువు తీరినా సీఎంను మార్చక ఏమార్చడం అధిష్ఠానం స్వయంకృతాపరాధం. అందుకే, సచిన్ పదే పదే లక్ష్మణరేఖ దాటుతున్నా ఉపేక్షించక తప్పని పరిస్థితి. మూడేళ్ళ క్రితం 2020లోనే సచిన్ తిరుగుబాటు చేశారు. అప్పుడే అశోక్, సచిన్‌ల మధ్య విభేదాలు సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పటికప్పుడు సర్దుబాట్లు, బుజ్జగింపులతో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం అధిష్ఠానం చేస్తున్నా అవేవీ ఆచరణలో ఫలించడం లేదన్నది తాజా పరిణామాల తాత్పర్యం.
అశోక్ తప్పులూ అనేకం. రాజస్థాన్‌ను వదిలి, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం తీసుకొమ్మని అధిష్ఠానం కోరినా, మనస్కరించని ఆయన గత సెప్టెంబర్‌లో తన ఎమ్మెల్యేలతో నడిపిన నాటకం తెలిసిందే. అధిష్ఠానం అభీష్టాన్ని సైతం తెలివిగా పక్కకు తప్పించి అశోక్ సీఎంగానే కొనసాగడం, దూతగా వెళ్ళిన ఖర్గే విఫలమై చివరకు అనూహ్యంగా పార్టీ అధ్యక్షుడు కావడం, సీఎం సీటుపై సచిన్ ఆశలు మళ్ళీ నీరుగారడం ఒకప్పటి బలసంపన్న కాంగ్రెస్‌లోనైతే కలలో కూడా ఊహించలేం. అశోక్‌కు వసుంధరా రాజెతో అవగాహన, ఆత్మీయత ఉన్నాయనేది సచిన్ ఆరోపణ.
అప్పట్లో అశోక్ వర్గ ఎమ్మెల్యేల పైన, ఇప్పుడు సచిన్ పైన చర్యలు తప్పవని పార్టీ నాయకత్వం బీరాలు పలికినా, చెబుతున్న ‘పెద్ద శస్త్రచికిత్స’ మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ అనివార్యత అర్థం చేసుకోదగినదే. ఎన్నికలకు అశోక్ సారథ్యాన్ని సహించే పరిస్థితిలో సచిన్ లేరు. అలాగని ఎన్నికలకు ముందు 2021 సెప్టెంబర్‌లో పంజాబ్‌లో సీఎంను మార్చి, చేజేతులా ఓటమి తెచ్చుకున్న హస్తం పార్టీకి మరో దుస్సాహసం చేసే ధైర్యం లేదు. ఇక, అశోక్ సారథ్యంలోనే రాజస్థాన్‌లో పార్టీ మళ్ళీ గెలిచినా, మరో అయిదున్నరేళ్ళు నిరీక్షించే ఓపిక ఇప్పటికే ఒకసారి మోసపోయాననుకుంటున్న సచిన్‌కు లేదు.
రాజకీయ ధురంధరుడైన అశోక్ సంక్షేమం, సామాజిక న్యాయమే మంత్రాలుగా పేదల ప్రభుత్వ మనే పేరుకై పరిశ్రమిస్తున్నారు. ఇదే తననూ, తమ పార్టీనీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని బలంగా నమ్ము తున్నారు. ఆ మాటేమో కానీ, అంతర్గత పోరుతో పార్టీ పలచనైపోతోంది. అశోక్ వివేకాన్ని ప్రద ర్శిస్తూ సచిన్‌ను కలుపుకొనిపోవడం, పిన్న వయస్కుడైన సచిన్ సహనంతో నిరీక్షించడం, అధిష్ఠానం తన పెద్దరికాన్నీ, నాయకత్వాన్నీ చూపడం అత్యవసరం. పార్టీ పెద్దలు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దక పోతే కష్టం. జాప్యమయ్యేకొద్దీ బీజేపీకి కలిసొస్తుంది. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment