కూడదీసుకొనే ప్రయత్నం | Sakshi Editorial On Congress Party | Sakshi
Sakshi News home page

కూడదీసుకొనే ప్రయత్నం

Published Tue, Feb 28 2023 12:37 AM | Last Updated on Tue, Feb 28 2023 12:37 AM

Sakshi Editorial On Congress Party

ఆటలో గెలవాలంటే ప్రత్యర్థి బలం తెలియాలి. అంతకన్నా ముందు మన బలహీనత తెలియాలి. ఈ తత్త్వం గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు క్రమంగా తలకెక్కుతున్నట్టుంది. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ ఫిబ్రవరి 24 నుంచి 3 రోజుల కాంగ్రెస్‌ 85వ ప్లీనరీని చూశాక ఈ అభిప్రాయమే కలుగుతుంది. ప్రతిపక్షంగా బలంగా నిలబడాలనీ, పాలకపక్షంతో కలబడాలనీ ప్లీనరీ సాక్షిగా కాంగ్రెస్‌ కసరత్తు చేయడం సంతోషమే.

కానీ గతం నుంచి ఏం నేర్చుకుంది? ఎంత మారింది? ఇతర ప్రతిపక్షాల్ని కలుపుకొనిపోవడానికి ఏం చేస్తోందన్నది కీలకం. అందుకే, బీజేపీని ఢీ కొనడానికి భావసారూప్య పక్షాలతో పొత్తులకు సిద్ధమంటూనే, ప్రతిపక్షాలు చీలి మూడో కూటమి కడితే బీజేపీ సారథ్య ఎన్డీఏకే లాభిస్తుందని హస్తం పార్టీ బాహాటంగా ఒప్పుకోవడం గమనార్హం. బీజేపీ వివిధ సామాజిక వర్గాల్లో విస్తరిస్తున్న వేళ దీటుగా కొత్త సామాజిక న్యాయ అజెండాతో ముందుకొచ్చింది.

ఈ ప్లీనరీలో వ్యవస్థాపరమైన సంస్కరణలు, ఎన్నికల పొత్తులు, ఉత్తరాదిన పార్టీ భవితవ్యం మెరుగుదలకు చర్యలు వగైరా చర్చిస్తారని ఆది నుంచి అందరూ భావించారు. ఆ మాటకొస్తే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ పునరుజ్జీవనానికి దిశానిర్దేశం జరిగేలా మేధామథనం చేయడం ఈ మూడు రోజుల ప్లీనరీ ప్రధాన ఉద్దేశం.

అది పూర్తిగా నెరవేరిందా అంటే అనుమానమే. కానీ, ఆశ, నిరాశల మేళవింపుగా పార్టీ ప్రతినిధుల మహా జాతర ముగిసింది. నిరుడు ఎన్నికైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సామర్థ్యాన్ని ప్లీనరీలో ఒకరిద్దరు ప్రస్తావించినా, అంతా గాంధీ త్రయం స్తోత్రపాఠాలకే పరిమితమవడం మారని నైజానికి ఉదాహరణ. 

దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న సంస్కరణలకు చడీచప్పుడు లేకుండా తిలోదకాలు ఇచ్చేశారు. నిరుడు మేలో ఉదయ్‌పూర్‌లో పార్టీ ‘నవ సంకల్ప శిబిరం’లో చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు ఎటు పోయాయో తెలీదు. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంటూ రాహుల్‌ మానసపుత్రికగా వచ్చిన ప్రతిపాదన పార్టీలో అత్యవసర ప్రక్షాళన తెస్తుందని అప్పట్లో తెగ ప్రచారమైంది. తీరా ఇప్పుడు దాన్ని చాపకిందకు నెట్టేశారు.

అలాగే, పార్టీ కొందరి కుటుంబ వ్యవహారం కాదని చెప్పేందుకు ‘ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌’ అన్న అప్పటి మరో సంస్కరణకు అతీగతీ లేదు. ఇక, 1998లో తొలిసారి అధ్యక్షపదవి చేపట్టి, పాతికేళ్ళలో పార్టీ ఉత్థానపతనాలకు సాక్షిగా నిలిచిన సోనియా రిటైర్మెంట్‌ వార్తల సంచలనం సరేసరి. పార్టీ వెంటనే నష్టనివారణకు దిగి, ఇన్నింగ్స్‌ ముగింపని సోనియా అన్నది అధ్యక్ష పదవికేనని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘమైన ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ’ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు సైతం ప్లీనరీలో జరగాలన్నది కాంగ్రెస్‌ రాజ్యాంగం. 2020 ఆగస్ట్‌లో ‘జీ–23’ అసమ్మతి నేతలు సోనియాకు లేఖాస్త్రంలో చేసిన డిమాండ్‌ అదే. కానీ, ప్లీనరీ ప్రారంభం కాక ముందే ఆ ఎన్నికల కథ కంచికి చేరింది. ఎన్నికై వచ్చేవారు రేపు ఖర్గే చేసే ప్రతి పనికీ తల ఊపరేమోననే సందేహంతో, సీడబ్ల్యూసీపై పార్టీ యూ టర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది.

18మంది ఎన్నికైన సభ్యులు, 17 మంది నామినేటెడ్‌ సభ్యులు ఉంటారని పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసినా, మొత్తం 35 మందినీ నామినేట్‌ చేసి, సొంత ‘టీమ్‌35’ను ఎంపిక చేసుకొనే సర్వాధికారాన్ని ఖర్గేకే కట్టబెట్టడం విడ్డూరం. కుర్చీలో వ్యక్తులు మారినా, కాంగ్రెస్‌ తీరు మారలేదన్న భావన కలుగుతున్నది అందుకే.  

అలాగని ప్లీనరీలో సానుకూల అంశాలేమీ లేవని కాదు. పార్టీ రాజ్యాంగంలో పలు సవరణల్ని ఆమోదిస్తూనే, అధికారంలోకి వస్తే చేయనున్న చట్టాలను ప్లీనరీ పేర్కొంది. ఉన్నత న్యాయవ్యవస్థ, ప్రైవేట్‌ రంగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తెస్తామంటూ సామాజిక న్యాయ అజెండాను భుజానికెత్తుకుంది.

బీజేపీ కాదంటున్న కులగణనకూ తాను సిద్ధమంది. విద్యార్థులపై వివక్షను నివారించే రోహిత్‌ వేముల చట్టం, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా తక్కువకు వ్యవసాయ ఉత్పత్తులు కొంటే శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టం లాంటివి చెప్పుకోదగ్గవే.

అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఒబీసీలు, మైనారిటీలకు పార్టీలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే సవరణా ఆహ్వానించదగ్గదే. భారత్‌ జోడో యాత్రతో  చేపట్టిన తపస్సును కొనసాగించడానికి కొత్త ప్రణాళికతో పార్టీ ముందుకు వస్తుందన్న రాహల్‌ ప్రకటన, ఈసారి దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి మరో యాత్ర ఉంటుందన్న వార్తలు ఉత్సాహజనకాలే. అయితే, స్వీయతప్పిదాలు, రానున్న సవాళ్ళపై ప్లీనరీలో జరగా ల్సిన అంతర్మథనం పూర్తిగా జరిగినట్టు లేదు. 

2024 జాతీయ ఎన్నికలకు ముందు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికల కర్టెన్‌రైజర్‌ కీలకం. సోమ వారం 3 ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగ్గా, రానున్న నెలల్లో కర్నాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడనున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రతిపక్షాల పొత్తులు, కాంగ్రెస్‌ బేరసారాల శక్తి ఉండనున్నాయి. ఆ ఎన్నికల్లో హస్తానిది పైచేయి కాకుంటే, ఇప్పటికే కాంగ్రెస్‌ వినా మూడో ఫ్రంట్‌కై సాగుతున్న యత్నాలు ఊపందుకుంటాయి. 

అందుకే, గతంలో యూపీఏ సారథిగా ముందున్న కాంగ్రెస్‌ తన పట్టు నిలుపుకోవడానికి శ్రమించక తప్పదు. ప్లీనరీకి ఇచ్చిన ప్రకటనల్లో మౌలానా ఆజాద్‌ ఫోటో విస్మరించిన నేతలు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పొరపాట్లు ప్లీనరీలో చిన్నవే కావచ్చు. కానీ, రేపు ఎన్నికల్లో చిన్న పొరపాట్లకూ పెద్దమూల్యం ఉంటుంది. గత రెండు ఎన్నికలుగా కాంగ్రెస్‌కు అది అనుభవైకవేద్యమే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement