బాలిక హత్యకేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాష్
సాక్షి, భీమవరం: భీమవరం లెప్రసీ కాలనీలో ములుకు రత్నకుమారి (12) హత్య కేసులో నిందితుడు వరుసకు బాబాయ్ అయిన ములుకు శివ (మావుళ్లు)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ యు.రవిప్రకాష్ చెప్పారు. కేసు వివరాలను వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. లెప్రసీ కాలనీలో నివాసముంటున్న ములుకు అంజి, దుర్గ దంపతుల కుమారై రత్నకుమారి ఈనెల 26వ తేదీ నుంచి కనిపించడం లేదని ఈ నెల 27న వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో దుర్గ ఫిర్యాదు చేసిందన్నారు.
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, 28న బాలిక మృతదేఽహం వారి ఇంటి వెనుక గల జమ్ముగడ్డి తోటలో కనిపించడంతో అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వివరించారు. అయితే బాలికను హత్య చేసిన మృతురాలికి వరుసకు చిన్నాన్న అయిన మావుళ్లు తనపై బాలిక బంధువులు దాడి చేస్తారనే భయంతో శుక్రవారం సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ గ్రంధి పవన్‌కుమార్ వద్ద లొంగిపోయి బాలిక మరణానికి తానే కారణమని ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు.
దీంతో మావుళ్లును అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే బాలిక ఎలా మృతి చెందిదనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉందన్నారు. దిశ డీఎస్పీ మురళీకృష్ణ, భీమవరం డీఎస్పీ బండారు శ్రీనాధ్, సీఐ అడబాల శ్రీను, ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment