వచ్చారు.. వెళ్లారు
కొల్లేరుపై నోరుమెదపని ముఖ్యమంత్రి చంద్రబాబు
బ్రిడ్జిపై నుంచి 5 నిమిషాలు తమ్మిలేరు పరిశీలన
గొప్పలు, రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం
ఎంపిక చేసిన రైతులు, నాయకులకే ఆడిటోరియంలోకి అనుమతి
సీఎం పర్యటనకు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల డుమ్మా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరు వచ్చారు.. వెళ్ళిపోయారు. అంతకుమించి ఏమి వరద బాధితులను ఆదుకునే ఒక్క ప్రకటనా చేయలేదు. ఉమ్మడి పశ్చిమలో అత్యంత కీలకమైన కొల్లేరుపై కనీస ప్రస్తావన లేదు. ఐదు నిమిషాలు.. అది కూడా బ్రిడ్జిపై నుంచి రిటైనింగ్ వాల్ కట్టిన తమ్మిలేరును పరిశీలించారు. చివరిగా ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల విషయం సీరియస్‌గా ఆలోచిస్తానని ఒక మాట చెప్పారు. ఇదీ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరదపై నిర్వహించిన సమీక్ష.. దాదాపు గంటసేపు మాట్లాడిన మాటలన్నీ గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప జిల్లాలో వరదపై చర్చ జరగని పరిస్థితి.
నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ఆకివీడులో పర్యటించాలి. వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటనను ఆకస్మాత్తుగా ఏలూరుకు మార్చేశారు. సీఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్ హెలీప్యాడ్‌లో దిగిన ముఖ్యమంత్రి అక్కడ నుంచి నేరుగా కొత్తబస్టాండ్ సమీపంలోని తమ్మిలేరును బ్రిడ్జిపై నుంచి కేవలం 5 నిమిషాలు పరిశీలించారు. వెంటనే సీఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఎంపిక చేసిన వరద బాధితులు, నాయకులు, అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. అక్కడ నూజివీడు, తమ్మిలేరు వరద నష్టాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ఉప్పుటేరు పరిస్ధితిపై లైవ్ ప్రజెంటేషన్ పది నిమిషాల్లో ముగించి ఎంపిక చేసిన ఐదుగురితో మాట్లాడించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు.
అంతా నా వల్లే
విజయవాడ వరదలు సమర్ధంగా ఎదుర్కొన్నానంటూ ఒకటికి నాలుగుసార్లు చెప్పారు. మొదటి రెండు రోజులు అధికారులు కూడా నీళ్ళల్లోకి దిగి పనిచేయకపోతుంటే తాను బురదలో నడిచానని, అప్పుడు ఐఏఎస్‌లు, అధికారులందరూ వచ్చారని, అంతా నా వల్లే జరిగిందని చెప్పారు. ప్రసంగంలో ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీని తీవ్ర స్థాయిలో విమర్శించడం, అలాగే సాయం చేయడానికి డబ్బులు లేవని.. ఖజానా ఖాళీ అంటూ చెప్పుకొచ్చారు. తిత్లీ తుఫాన్ సమయంలో ఎకరాకు రూ.20 వేలు తానే ఇచ్చానని, ఇప్పుడు ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి ఎంపిక చేసిన వారితో చప్పట్లు కొట్టించుకున్నారు.
కొల్లేరు ఊసు లేదు
ఉమ్మడి పశ్చిమలో అత్యంత కీలకమైన కొల్లేరు మహోగ్రరూపం దాల్చడంతో పదుల సంఖ్యలో లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పుటేరుపై సమీక్ష అని ప్రకటించినా కొల్లేరు ప్రస్తావనే లేదు. లంక గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్దడం, బాధితులకు అందచేసే సాయం, పరిహారంపై ఊసేలేదు. ఇక కొల్లేరు ప్రక్షాళనపై మాట కూడా లేదు. ఒక్క తమ్మిలేరుపై శనివారపుపేటలో రూ.15 కోట్లతో కాజ్‌వే స్థానంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించానని చెప్పడం మినహా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదు.
ప్రజాప్రతినిధుల డుమ్మా : టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగా రోషన్, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌లు గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment