ద్వారకాతిరుమల మండలంలో భయాందోళనలో గ్రామస్తులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్‌లో శనివారం రాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. స్థానిక వీరాంజనేయ దాబా సమీపంలో చిరుత సంచారాన్ని చూసిన పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీస్, రెవిన్యూ, అటవీశాఖ అధికారులకు అందించారు.
దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ ఏలూరు రేంజ్ అధికారి ఎస్‌వీకే కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి కె.కుమార్‌సింగ్, సిబ్బంది, భీమడోలు సీఐ జోసఫ్ విల్సన్, పలువురు రెవెన్యూ అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించి, వాటిని పరిశీలించారు.
అవి చిరుత పులి జాడలేనని నిర్ధారించారు. అనంతరం స్థానిక అందానమ్మ చెరువు, శ్రీ కార్తీకేయ ఫ్‌లైయాష్ బ్రిక్స్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో జాడలు గుర్తించారు. ఆ సమీప ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దాంతో ప్రజలు, శని, ఆదివారాల్లో చర్చిలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు గ్రామంలో టాంటాం వేయించారు. ద్వారకానగర్‌తో పాటు భీమడోలు, పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment