పౌల్ట్రీకి కోలుకోలేని దెబ్బ
బయో సెక్యూరిటీ అంటే..
● కోళ్ల ఫారాల్లోకి ప్రవేశించే మనుషులు, వాహనాలకు డిస్ ఇన్‌ఫెక్షన్ రసాయనాన్ని తప్పనిసరిగా స్ప్రే చేయాలి.
● కోళ్ల ఫారాల్లోకి కొంగలు, వలస పక్షులు, ఇతర పక్షులు ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాలి.
● కోళ్ల ఫారాలు, కోళ్ల పెంట ప్రాంతాల్లోకి పక్షులు రాకుండా లింక్ మెస్‌లు ఏర్పాటు చేయాలి.
● కోళ్ల ఫారాల్లోకి ఇతరులను అనుమతించకూడదు.
● ఒక కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన వారిని మరొక కోళ్ల ఫారంలోనికి అనుమతించరాదు.
● ఫారాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో నిర్వహించాలి.
● కోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికులు మాత్రమే కోళ్ల దగ్గరకు వెళ్ళాలి. సందర్శకులను రానీయకూడదు.
తణుకు అర్బన్: బర్డ్‌ఫ్లూ వైరస్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ఫారాల్లో వచ్చిన వైరస్ పౌల్ట్రీ రైతాంగానికి తీరని వ్యథ మిగిల్చింది. దాదాపు రాష్ట్రంలో రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వైరస్‌తో కొన్ని చనిపోగా, మరికొన్ని చంపేయాల్సి రావడం తీరని ఆవేదన మిగిల్చింది. అప్పులు చేసి కోళ్లను పెంచుతున్నామని, ఇప్పుడు బ్యాంకు రుణాలు ఎలా కట్టాలి అంటూ పశుసంవర్ధక శాఖ అధికారుల వద్ద రైతులు ఘొల్లుమన్న తీరు కలచివేసింది. అధికారులు ఏమైనా సాయం అందేలా చూస్తారని ఎదురు చూస్తున్న రైతుల్లో బయోసెక్యూరిటీ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లే కోళ్లకు వైరస్ వచ్చిందని వ్యాఖ్యలు చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కోళ్ల ఫారాల్లో కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నట్లే బయోసెక్యూరిటీ విధానాన్ని పాటిస్తున్నామని.. అయినా అధికారులు బయోసెక్యూరిటీని కారకంగా చూపడంపై గగ్గోలు పెడుతున్నారు.
కేంద్ర బృందానికి వినతి
ఈ నెల 20న తణుకు, బాదంపూడి, కానూరు ప్రాంతాల్లో కేంద్ర పశుసంవర్ధక శాఖ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా తణుకు చిట్టూరి హెరిటేజ్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో సభ్యులు, రైతులు తమ సమస్యలను బృందానికి విన్నవించుకున్నారు. కోళ్లకు వచ్చిన వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం అతలాకుతలమైపోయిందని, వైరస్ కారణంగా చనిపోయిన, కళ్లింగ్ చేసిన కోళ్ల కంటే ప్రజల్లోకి ప్రచారం అతిగా వెళ్లడంతో వైరస్ లేని ప్రాంతాల్లో కూడా చికెన్‌ను ముట్టుకోని స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్లు పెంచలేక ఊరకనే ఇచ్చేసే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
రెడ్‌జోన్‌లో...
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో 5 కోళ్ల ఫాంలు ఉండగా రెండింటిలో మాత్రమే వైరస్ బయటపడింది. రెండు ఫాంలలో 85 వేల కోళ్ల సామర్థ్యం ఉండగా 49 వేల కోళ్లు వైరస్ బారిన పడి మృతిచెందగా, మరొక 21,907 కోళ్లను ఖననం చేశారు. రెడ్ జోన్ పరిధిలో పూర్తిస్థాయిలో శానిటేషన్ ప్రక్రియ పూర్తిచేసి మూడు నెలలపాటు ఆయా ఫారాలపై నిషేధాజ్ఞలు విధించారు. ఇకపై కోళ్ల ఫారాల్లో బయోసెక్యూరిటీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలయ్యేలా పశుసంవర్థక శాఖ అధికారుల పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, 50 వేల కోళ్ల సామర్థ్యం ఉన్న ఫారాల్లో నిబంధనల ప్రకారం పశుసంవర్థక శాఖ వైద్యుల అనుమతులు తప్పనిసరని చెబుతున్నారు.
బయో సెక్యూరిటీతో సోకని వైరస్
ఉంగుటూరు : బయో సెక్యూరిటీ పాటిస్తే బర్డ్‌ఫ్లూ సోకే ప్రమాదం తప్పుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 300 కోళ్లఫారాలలో కోళ్లు పెంచుతుంటే కేవలం 25 లోపు ఫారాల్లో బర్డ్‌ఫ్లూ సోకింది. మిగిలిన 275 ఫారాలలో కోళ్లు ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం.. బయోసెక్యూరిటీ అమలు చేయడం వల్లే. వలస పక్షులు ఫారాలలోకి ప్రవేశించడం వల్ల బర్డ్‌ఫ్లూ సోకడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఓ కోళ్ల ఫారంలో సుమారు రెండు లక్షల కోళ్లు మృత్యువాత పడగా.. సమీపంలోనే ఇతర ఫారాలలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి.
బయో సెక్యూరిటీతో చెక్ పెట్టొచ్చు
బయో సెక్యూరిటీ పాటిస్తే బర్డ్‌ఫ్లూ రాకుండా నివారించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి కోడిలో తగ్గనీయకుండా చర్యలు తీసుకోవాలి. క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. కోళ్లకు కూడా మినరల్ వాటర్ అందించాలి. బయో నిబంధనలు పాటిస్తే వ్యాధులను అడ్డుకోవచ్చు.
– డా.వల్లూరి సందీప్, పశు వైద్యాధికారి
రూ.100 కోట్లకు పైగా నష్టమన్న పౌల్ట్రీ ఫెడరేషన్
వైరస్ కంటే ప్రచారంతోనే ఎక్కువ ముప్పు
బయో సెక్యూరిటీ లోపమన్న కేంద్ర బృందం
బయో సెక్యూరిటీ నిబంధనలు పాటిస్తున్నామంటున్న రైతులు
పౌల్ట్రీకి కోలుకోలేని దెబ్బ
Comments
Please login to add a commentAdd a comment