ఆక్వాకుఅండగామత్స్యకిసాన్
భీమవరం: ఆక్వా రంగంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకంలో బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ బీమా పథకంపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
బీమా పథకం విధి విధానాలు..
ఆక్వా పంట సాగు 180 రోజుల ప్రీమియం ధర తొలి 60 రోజులకు వర్తిస్తుంది. తరువాత ప్రతి 30 రోజులకు నిర్ణీత ప్రీమియం చెల్లించాలి. బీమా ఒక పంట కాలానికి మాత్రమే వర్తిస్తుంది. చెరువుల్లో రొయ్య పిల్లలు వేసిన తరవాత ఎక్కువ సంఖ్యలో రొయ్యలుంటే సాధరణంగా రైతులు మధ్యలో పట్టుబడి చేస్తుంటారు. అలా ఏ కారణంచేతనైనా మధ్యలో పట్టుబడి చేస్తే బీమా కాల పరిమితి ముగిసినట్లే. పంట మొత్తం పాడైతేనే బీమా వర్తిస్తుంది. బీమా వర్తించిన పంటకు బీమా సొమ్ములో 80 శాతం తిరిగి రైతుకు చెల్లిస్తారు. బీమా చెల్లించిన రైతులు తమ చెరువుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. రొయ్యలు పాడైయిపోతే సమూనాలు ల్యాబ్‌లో పరీక్ష చేయించి 24 గంటల్లో బీమా కంపెనీకి రిపోర్టు ఇవ్వాలి. కంపెనీ ప్రతినిధులు సరుకును పరిశీలించి నిర్ధారించిన తరవాత పట్టుబడి చేయాలి. రావడం ఆలస్యమైతే రొయ్యల పట్టుబడిని సీసీ కెమెరాలు లేదా జియోట్యాగింగ్, పట్టిన తేదీ, సమయం కలిపి సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి బీమా కంపెనీ ప్రతినిధులకు అందించాలి.
రెండు రకాల బీమా
బేసిక్ కవరేజ్ స్కీంలో ప్రీమియం లక్షకు రూ.3,100 చెల్లించాలి.. దీనికి జీఎస్టీ అదనం. బీమా చెల్లించినా వరదలు, భారీ వర్ష్లా కారణంగా చెరువులు ముంపునకు గురికావడం, కాలుష్య కారణాల వల్ల సరుకు పాడైనప్పుడు, చెరువులో విష ప్రయోగం జరిగి రొయ్యలు మత్యువాత పడినప్పుడు, తెగుళ్ల కారణంగా పాడైన చెరువులకు బీమా వర్తించదు. కాంప్రహెన్సివ్ కవరేజ్: ప్రీమియం రూ. 6 వేలు చెల్లిస్తే బేసిక్ కవరేజీలో ఉన్న వాటితోపాటు వ్యాధుల వల్ల సరుకు పాడైన చెరువులకు బీమా వర్తిస్తుంది.
హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకే ప్రయోజనం
ఆక్వా రంగానికి గతంలో కూడా బీమా అవకాశం కల్పించారు. ఈ పథకం రైతుల కంటే హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఎంపెడా ఆధ్వర్యంలో రైతులకు ఎక్కువ ప్రయోజనం కల్పించేలా కృషిచేయాలి. దీనిపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
– గాదిరాజు సుబ్బరాజు, ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి
రైతులకు ప్రయోజనం
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ ఆక్వా సమృద్ధి సహ యోజన పథకంలో తెచ్చిన బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజకరం. రెండు విధానాల్లో బీమా చెల్లించే అవకాశమున్నందున రైతులు తమకు ఇష్టమైన పథకాన్ని ఎంచుకోవచ్చు. ఆక్వా బీమా పథకంపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఆర్‌వీ ప్రసాద్, జిల్లా మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్, భీమవరం
ఆక్వాకుఅండగామత్స్యకిసాన్
ఆక్వాకుఅండగామత్స్యకిసాన్
Comments
Please login to add a commentAdd a comment