ఎమ్మెల్సీ ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏలూరు జిల్లాకు సంబంధించి విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలింగ్ అధికారులను ప్రశ్నలు అడిగి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారన్నారు. బ్యాలెట్ పేపర్‌ను మడతపెట్టి బాక్సులో వేయడంపై అవగాహన కల్పించారు. పీఓ, ఏపీఓలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పకడ్బందీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మాస్టర్ ట్రెయినీలు శ్రీనివాస్, ఫణి ఓటు వేసే విధానం, పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ మెటీరియల్స్, ముఖ్యమైన ఎన్నికల సామగ్రి తనిఖీ, పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే చేయాల్సిన విధులు, పోలింగ్ రోజు విధులు తదతరాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్సు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడంపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ముక్కంటి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment