కార్మికులకు కన్నీళ్లే
ఆకివీడు : కార్మికుల కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నా వాటి ప్రయోజనం మాత్రం లబ్ధిదారులకు అందడం లేదు. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వివరాల్ని ఈ–శ్రమ యాప్‌లో నమోదు చేయిస్తున్నారు. ఈ పోర్టల్‌లో నమోదు చేయడం వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇంతవరకూ అమల్లో ఉన్న ఏ పథకం వల్ల తమకు ప్రయోజనం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికుల కోసం యాజమాన్యం రూపాయి కార్మిక ఫండ్‌గా చెల్లిస్తోంది. కార్మిక సంక్షేమం కోసం ఈ సొమ్మును వినియోగించాల్సి ఉండగా, ఈ నిధి తమకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని కార్మికులు అంటున్నారు. కనీస వేతన చట్టం కనుమరుగైపోయింది. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకనుగుణంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలనే డిమాండ్ అమలు చేయడం లేదు. కార్మికులకు రూ.3 వేలు ప్రావిడెంట్ ఫండ్ ఇస్తామని బీజేపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోయింది. 2024 ఎన్నికల్లో రూ.5 వేలు చేస్తామన్న చెప్పినా.. ఇంతవరకూ అమలు దిశగా ఎలాంటి చర్యలు లేవంటున్నారు.
రూ.10 లక్షల చంద్రన్న బీమా ఏమైంది?
గత ఎన్నికల్లో చంద్రన్న బీమా సౌకర్యాన్ని రూ.10 లక్షలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు ఏమైందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమాగా చెల్లించేవారు. ప్రమాద బీమాను ఎన్నికల నినాదంగా వాడుకున్న కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలైనా బీమా ఊసే ఎత్తడంలేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ ఆసుపత్రులు దిష్టిబొమ్మల్లా ఉన్నాయని పలువురు కార్మికులు, కార్మిక సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో కనీస మందులు ఉండడం లేదు. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపలిగూడెంలలోని డిస్పెన్సరీల్లో పర్మినెంట్ వైద్యులు అందుబాటులో లేరు.
కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించివేస్తున్నారని సీఐటీయూ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ తప్పుపట్టారు. ఉద్యమాలతో పుట్టిన చట్టాల్ని రక్షించుకునేందుకు కార్మికులు సంఘటితం కావాలన్నారు. కార్మిక చట్టాల్ని పునరుద్ధరించి, దేశ ప్రగతికి ప్రభుత్వాలు నడుం బిగించాలని, సంక్షేమ నిధి, ఈఎస్‌ఐలను అభివృద్ధి చేయాలని సీఐటీయు ఆకివీడు మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు అన్నారు.
కంటి తుడుపుగా ఈ–శ్రమ పోర్టల్
అమలు కాని కార్మిక సంక్షేమ పథకాలు
ఉమ్మడి జిల్లాలో కార్మికుల వివరాలు
అసంఘటిత భవన నిర్మాణ సంఘటిత
ఏలూరు 5,35,391 3,63,063 1,35,723
పశ్చిమ గోదావరి 6,50,200 4,50,200 45,000
Comments
Please login to add a commentAdd a comment