ఏలూరు (మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అర్హులైన వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్‌ను వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే గ్రేడ్–2 వారికి గ్రేడ్–1 వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రెవెన్యూ విలేజ్‌లకు సంబంధం లేకుండా రెండు సచివాలయలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఒక వీఆర్‌ఓ ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం వల్ల పని భారం పెరుగుతుందని, రెవెన్యూ సేవలు కూడా ఆలస్యం అవుతాయని అన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రితో జరిగే సదస్సులో క్లస్టర్ విధానం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అక్బర్, జిల్లా కోశాధికారి రవికుమార్, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఏలూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు మండల వీఆరోఓలు పాల్గొన్నారు.