
ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహల పర్యాటక ప్రాంతంలో ఐదేళ్ల క్రితం బాలికపై హత్యాచారం, ప్రియుడిపై దాడి కేసులో పోలీసులు ప్రతిభ చూపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేశారని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి నలుగురు నిందితులకు జీవిత కాల ఖైదు విధించారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కేసులో ప్రతిభ చాటిన వారిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయటంలో అధికారులు, సిబ్బంది చూపించిన శ్రద్ధ, చిత్తశుద్ధిని ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్, జంగారెడ్డిగూడెం సీఐ బీ.కృష్ణబాబు, తడికలపూడి ఎస్సై చెన్నారావు, టీ.నరసాపురం ఎస్సై కే.విజయబాబు, ఏలూరు మహిళా స్టేషన్ సీఐ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జ్ ఎం.సుబ్బారావు, తడికలపూడి కోర్టు కానిస్టేబుల్ కేపీవీడీఎన్ కొండలరావు, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్, మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటరమణ, కానిస్టేబుల్ టీ.రవికుమార్‌ను అభినందించారు.