ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గత 11 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.86,52,879 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 103 గ్రాముల బంగారం, 2.075 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకిరాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.28,500 లభించినట్టు చెప్పారు.
రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. అందులో భాగంగా తొలిరోజు ఉగాది నాడు అమ్మవారు లక్ష గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. అమ్మవారికి కుంకుమ పూజలు, చంఢీ హోమం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.
కొనసాగుతున్న డయాఫ్రం వాల్ పనులు : నిమ్మల
పాలకొల్లు సెంట్రల్: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు రూ.990 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం పాలకొల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు 2014–19లో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేసినట్టు చెప్పారు. నిర్వాసితులకు రూ.829 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.
వరకట్న వేధింపుల కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. పట్టణంలోని రాజులకాలనీకి చెందిన గెడ్డం వీరేంద్రకుమార్ రాజాకు, రమ్య మధురికకు 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఈ నెల 23 నుంచి వీరేంద్రకుమార్ రాజా అధిక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడన్నారు. దీనికి అతని కుటుంబసభ్యులు సహకరిస్తున్నారని, ఈ నెల 27 రాత్రి వీరేంద్రకుమార్ రాజా కట్నం తేవాలని భార్య రమ్య మధురికను కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడన్నారు. దీంతో శుక్రవారం రమ్య మధురిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు