
బంధువునని నమ్మించి దోపిడీ
భీమవరం: దూరపు బంధువునని నమ్మించాడు. అదును చూసి దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆనక పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం వన్‌టౌన్‌పోలీసు స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన 23 ఏళ్ల పి విట్టర్‌పాల్ తాపీ పనిచేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో మార్చి 28వ తేదీన పట్టణంలోని బేతనిపేట అమ్మిరాజుతోటలోని యర్రంశెట్టి మంగతాయారు ఇంటికి వెళ్లి తాను వారికి దూరపుబంధువునని నమ్మించాడు. ఇళ్లు అద్దెకు కావాలని ఇళ్లు చూడడానికి ఇంకా తనవాళ్లు వస్తున్నారంటూ వృద్ధులతో కబుర్లుచెప్పసాగాడు. మూడు గంటల సమయం గడిచిపోవడంతో మంగతాయారు భర్త వీరాస్వామినాయుడు బయటకు వెళ్లడంతో విట్టర్‌పాల్ ఒక్కసారిగా మంగతాయారుపై చాకుతో దాడిచేసి ఆమె మెడలోని సుమారు రూ.5 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు గొలుసు, మంగళసూత్రాలు, నల్లపూసలతాడు అపహరించుకుపోయాడు. గాయాలైన మంగతాయారును ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, సీఐ ఎం.నాగరాజు, సీసీఎస్ సీఐ డి రాంబాబు, ఎస్సైలు బీవై కిరణ్‌కుమార్, ఎం రవివర్మ సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితుడు విట్టర్‌పాల్‌ను సోమవారం పట్టణంలోని బ్రిడ్జిపేట వంతెన వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించడంలో కృషిచేసిన అధికారులను అభినందించి, సిబ్బందికి రివార్డులను అందించారు.
రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాల అపహరణ
పోలీసులకు చిక్కిన నిందితుడు