
కూటమి నేతల ఆగడాలు తాళలేం
ఉంగుటూరు: గ్రామాల్లో కూటమి నాయకుల జోక్యం మితిమీరి ఉండటాన్ని నిలువరింపజేయాలని మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు శని వారం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. ఎంపీడీఓ రాజ్‌మనోజ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఎ.గోకవరం కార్యదర్శి కుసుమపై ఆ గ్రామ టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరించిన ఘటనతో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. అలాగే మరో నాలుగైదు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు విజయకుమార్, ఉపాధ్యక్షుడు ధనలక్ష్మి, కార్యదర్శి దుర్గాప్రసాద్, సభ్యులు రమేష్, ట్రెజరర్ రవికుమార్ ఆధ్వర్యంలో కార్యదర్శులు వినతిపత్రాలు అందజేశారు.