జంగారెడ్డిగూడెం: మండలంలోని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శశాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్.వంశీకృష్ణ (23), కె.బాలసుబ్రహ్మణ్యం(30) వరుసకు బావ బావమరిదిలు. వీరు శనివారం మధ్యాహ్నం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లారు. అక్కడ కొద్ది సేపు సేదతీరిన తరువాత స్నానం చేయడానికి జలాశయం కుడి కాలువ వద్దకు వెళ్లారు.
స్నానానికి దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే మునిగిపోవడంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది.