
శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంపై శనివారం అమావాస్య ఎఫెక్ట్ పడింది. స్వామివారిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శించారు. చినవెంకన్నకు ప్రీతికరమైనరోజు కావడంతో ప్రతి శనివారం వేలాదిగా భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ వారం అమావాస్య కావడంతో నామమాత్రంగా భక్తులు శ్రీవారిని దర్శించారు. మధ్యాహ్నం నుంచి అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం విక్రయాల కౌంటర్లు ఇలా దాదాపు అన్ని విభాగాలు ఖాళీగా మారాయి.
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
ముసునూరు: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు.శ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి నెల 31తో ముగియనుండగా, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ముసునూరు(బాలికలు), నాగిరెడ్డిగూడెం(బాలికలు), అప్పలరాజుగూడెం (బాలురు) గురుకులాల్లో 5వ తరగతిలో 80 చొప్పున 240 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
మట్టిని తరలిస్తున్న లారీల సీజ్
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని బరువానిపేట నుంచి భీమవరం వైపు అక్రమంగా మట్టిని తరలిస్తున్న 3 లారీలను గొల్లవానితిప్ప వద్ద ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోలకాలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్